పాలకుర్తి రూరల్/రాయపర్తి, జూలై 29 : త్వరలో జరి గే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు పని చేయాలని, అత్యధిక స్థానాల్లో విజయం సా ధించేలా కృషి చేయాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి, వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రాల్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఉన్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల పెట్టుబడిదారులు తమ కార్యకలాపాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి, వైజాగ్‌ల వైపు చూస్తున్నారని అన్నారు.
రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వంలో లుక లుకలు తారస్థాయికి చేరుకుంటున్నాయన్నారు. సుస్థిర ప్రభుత్వాన్ని నడిపే దమ్ము, ధైర్యం రేవంత్‌రెడ్డికి లేవన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను బీఆర్ఎస్లోనే ఉంటానని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందని, రైతు భరోసాకు దిక్కులేదన్నారు. రూ.2 లక్షల పంట రుణాల మాఫీ సక్రమంగా అమలు చేయడం లేదని, రైతులు బ్యాంకులు, సొసైటీల చుట్టూ తిరుగుతున్నారని ఎర్రబెల్లి విమర్శించారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించిన మ్యానిఫెస్టోలో ఆసరా పింఛన్లను రెట్టింపు చేసి ఇస్తామని చెప్పిన మాట ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు అదుపులో లేవని ధ్వజమెత్తారు. సీఎం, మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడికి రేవంత్‌రెడ్డి దాసోహమడం ఖాయమని, తెలంగాణలోని సహజ వనరులను మరోసారి ఆంధ్ర పాలకులు లూటీ చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు.
దేశ చరిత్రలో ప్రజలకు మంచి చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, కేసీఆర్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి జరిగిందని ఎర్రబెల్లి అన్నారు. పాలకుర్తి నియోజక వర్గంలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. వారం రోజుల్లో గ్రామ కమిటీల సమావేశాలు నిర్వహిస్తానని చెప్పారు. సమావేశాల్లో బీ ఆర్ఎస్ నాయకులు గుడిపూడి గోపాల్‌రావు, బిల్లా సుధీర్‌రెడ్డి, నల్లా నాగిరెడ్డి, పుస్కూరి శ్రీనివాస్‌రావు, పసునూరి నవీన్, వీరమనేని యాకాంతారావు, కారుపోతుల వేణు, మాచర్ల ఎల్లయ్య, ఎండీ మదార్, గుగ్గిళ్ల యాకయ్య, జోగు గోపి, మహ్మద్ నయీం, జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, ఆకుల సురేందర్‌రావు, పూస మధు, గారె నర్సయ్య, చిట్యాల వెంకటేశ్వర్లు, కుందూరు రాంచంద్రారెడ్డి, బోనగిరి ఎల్లయ్య, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, మహ్మద్ అక్బర్, కోదాటి దయాకర్‌రావు, ముద్రబోయిన సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.