దేవరుప్పుల/హనుమకొండ/తొర్రూరు: కేసీఆర్ తెచ్చిన బంగారు తెలంగాణ లో భాగస్వాములై పల్లెలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది కేంద్రం నుంచి అనేక ఉత్తమ అవార్డులు తెచ్చిపెట్టిన సర్పంచ్‌లను ఈ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి ప్రజాపాలన అంటే ఇదేనని చాటుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పెండింగ్ బిల్లుల కోసం పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌లను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపా రు.
విధిలేక పోరుబాట పడితే అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొ న్నారు. తాము అధికారంలోకి రాగానే సర్పంచ్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని, 11 నెలలు గడుస్తున్నా ఉలుకూపలుకూ లేకపోవడంతో మాజీ సర్పంచ్‌లంతా పోరుబాట పట్టారని, వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందన్నారు.
ఆస్తులు అమ్మి అప్పుల పాలైన మాజీ సర్పంచులకు బిల్లులు చెల్లించాల్సిందిపోయి అరెస్టులు చేస్తున్న ఈ ప్రభుత్వానికి రాబోయే స్థ్ధానిక సంస్థల ఎన్నికల్లో భంగపాటు తప్పదన్నారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ, చిన్న పనులు చేసిన మాజీ సర్పంచులకు మాత్రం బిల్లులు చెల్లించకపోవ డంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అక్రమంగా నిర్బంధించి, అరెస్టులు చేసిన మాజీ సర్పంచులను బేషరతుగా విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు.