పర్వతగిరి, మే 18: రైతుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్ట డం లేదా.. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. ఆదివారం పర్వతగిరి మండలం చింతనెకొండ, కొం కపాక గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతుల ఇబ్బందులు తెలుసుకుని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారదకు ఫోన్ చేసి వివరించారు. వారి సమస్యలపై తక్షణమే ఆయా శాఖల సిబ్బందితో మాట్లాడుతామని కలెక్టర్ తెలిపారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కోసం రోజుల తరబడి ఎదురుచూస్తూ దయనీయ పరిస్థితిలో ఉన్నారని అన్నారు.
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం వారి ప్రాణాల మీదకు తెచ్చిందని పేర్కొన్నారు. సాగు నీళ్లు అందించడంలో, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో, కాంటాలు పెట్టడంలో, ధాన్యానికి డబ్బులు చెల్లించడంలో, బోనస్ అందజేయడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈదురుగాలులు, అకాల వర్షాలతో రైతులు దినదినగండంగా గడుపుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు.
ఒక వైపు సర్కారు నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఏ ఒక రైతూ నష్టపోకుండా మద్దతు ధర అందేలా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి వారాల కొద్దీ వేచి చూసినా కాంటాలు కావడం లేదన్నారు. టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతున్నదని విచారం వ్యక్తం చేశారు.
వివిధ కారణాలు చెప్పి 5 కిలోల దాకా తరుగు తీస్తుండడం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నదని అన్నారు. ఇంటిని వదిలి, రోజుల తరబడి రైతులు వరి కుప్పలపై టార్పాలిన్లు కప్పి అకడే కాపలా కాస్తున్న పరిస్థితి ఉందన్నారు. భారం తగ్గించుకునేందుకు సన్నాలను కొనుగోలు చేయడం లేదని, కొర్రీలు పెడుతూ బోనస్ భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సరారు, మిల్లర్లు కలిసి డబుల్ గేమ్ ఆడి రైతులను నిండా ముంచుతున్నారని అన్నారు.
48 గంటల్లో ధాన్యం కొనుగోలు డబ్బులు వేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అన్నారని, ఏ ఊర్లో కూడా పది రోజులు లోపు అమ్మిన పంటకు సంబంధించిన డబ్బులు రావడం లేదని పేర్కొన్నారు. వెంటనే రైతు బీమా డబ్బులు ప్రభుత్వం చెల్లించాలని, చనిపోయిన రై తు కుటుంబాలకు డబ్బులను అందించాలని డి మాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు పంట నష్టం చెల్లించాలని, తడిసిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేసి, కొనుగోళ్ల్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు.
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వరరావు, పర్వతగిరి పీఏసీఎస్ చైర్మన్ మనోజ్ కుమార్ గౌడ్, వరంగల్ మారెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బోయినపల్లి యుగంధర్ రావు, మాజీ ఎంపీటీసీ కరిమిళ్ల మోహన్రావు, దబ్బెట యాలాద్రి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ గంధం బాలరాజు, చింతనెకొండ మాజీ ఉపసర్పంచ్ దర్నోజు దేవేందర్, నాయకులు జీడి గట్టయ్య, మాజీ ఎంపీటీసీలు మౌనిక, సుభాషిణి, డీ నరేశ్, మాజీ సర్పంచ్ జీ రాజు, బీ బాబు పాల్గొన్నారు.