హనుమకొండ, డిసెంబర్ 19 : బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించినట్లు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోవడంతో వస్తున్న ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపి పబ్బం గడుపుతోందని ఆరోపించారు. 2023లో దేశంలో అనేక నగరాలను కాదని హైదరాబాదును ఫార్ము లా ఈ రేస్ కోసం ఎంచుకోవడం మనకు గర్వకారణం అన్నారు. ఈ రేస్ నిర్వహించిన న్యూయార్, లండన్, బెర్లిన్, బీజింగ్, వంటి ప్రముఖ నగరాల సరసన హైదరాబాద్‌ను నిలబెట్టింది కేటీఆరేనని పేర్కొన్నారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేవలం కక్ష సాధింపు దిశగా ఈ రేసును రద్దు చేసి ఇప్పుడు కేటీఆర్ మీద అక్రమ కేసు లు నమోదు చేసి రేవంత్‌రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడడం రేవంత్‌రెడ్డి దుర్మార్గ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అక్రమంగా పెడుతున్న కేసులు అన్నింటిపై పోరాడుతున్న కేటీఆర్ అడ్డును తొలగించుకోవాలని ఇలాంటి నీచమైన పనులకు రేవంత్‌రెడ్డి తెరలేపి తాను రాక్ష స ఆనందం పొందుతున్నాడని ఆరోపించారు.
బ్రోకర్ మాటలు చెప్పే రేవంత్‌రెడ్డికి పాలన చేతకాక ఫార్ములా ఈ రేస్ అనే కొత్త నాటకానికి తెరలేపి సమయాన్ని వృథా చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ అసెంబ్లీలో కేటీఆర్ అడ్డు ఉండకూడదని దుర్మార్గపు, నీచమైన చర్యకు పాల్పతున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ఇకనైనా నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు బంద్ చేసి ప్రజలకు బాగు చేసే పనులు చేయమని హితవు పలికారు. ఏదో కేటీఆర్‌ను కేసులో ఇరికించి సంబుర పడుతున్నావేమో కానీ న్యాయస్థానంలో నీకు మొట్టికాయలు తప్పవు తస్మాత్ జాగ్రత్త అని దయాకర్‌రావు హెచ్చరించారు.