నర్సంపేట/నల్లబెల్లి/హనుమకొండ, ఆగస్టు 18 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారం పోలీసు నిర్బంధకాండ కొనసాగింది. ఈ నెల 10న నర్సంపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదురుగా ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని సోమవారం అర్ధరాత్రి పోలీసుల పర్యవేక్షణలో మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడే ముందస్తు అరెస్ట్ చేశారు.
తెల్లారేసరికి నర్సంపేట పట్టణం సహా నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలు, మేజర్గ్రామాల్లో పోలీసులు మోహరించారు. నల్లబెల్లిలోని పెద్ది ఇంటిని వందలాది మంది ఖాకీలు చుట్టుముట్టి అటువైపు ఎవరినీ వెళ్లనీయలేదు. మాజీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచారు. శాసనమండలిలో విపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం, తాటికొండ కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడేందుకు సంసిద్ధులయ్యారు.
ఈ క్రమంలో హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయానికి వస్తున్న వినయ్‌భాస్కర్‌ను అరెస్ట్ చేసి కేయూ పోలీస్ స్టేషన్‌కు, అక్కడి నుంచి బీమారంలోని పాత సీఆర్పీఎఫ్ క్యాంప్‌కు తరలించి అందులోని డెన్‌లో నిర్బంధించారు. విలేకరుల సమావేశం అనంతరం నర్సంపేటకు వెళ్తున్న సిరికొండను పార్టీ కార్యాలయం వద్దే అడ్డుకొని సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, ఎలాంటి నోటీసులు లేకుండా పెద్ది విగ్రహాన్ని కూల్చివేయడంపై నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు మంగళవారం భగ్గుమన్నారు. నర్సంపేట, ఖానాపూర్, దుగ్గొండి, నెక్కొండ, నల్లబెల్లి, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేయడంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఉద్యమనేత పెద్ది విగ్రహంపైనా కక్షారాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన విగ్రహం తొలగించడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ సర్కారు, ఎమ్మెల్యే దొంతి వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వం త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

నేడు నర్సంపేట బంద్ పిలుపునిచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే మాజీ ఎమ్మెల్యే పెద్ది విగ్రహాన్ని తొలగించారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. విగ్రహం తొలగింపుతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈ చర్యలను నిరసిస్తూ బుధవారం నర్సంపేట బంద్‌కు ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు, వ్యాపారులు సహకరించాలని ఎర్రబెల్లి కోరారు.