కాటారం, ఏప్రిల్ 15 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మంథని నియోజకవర్గం నుంచి గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. మంగళవారం కాటారం మండల కేంద్రంలో జరిగిన మల్హర్, కాటారం, మహాముత్తారం, మహదేవపూర్, పలిమెల మండలాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని వాల్ పోస్టర్లు ఆవిషరించారు.
ఈ సందర్భంగా మధూకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ 24 వసంతాలు పూర్తి చేసుకొని 25వ ఏడాదిలోకి విజయవంతంగా అడుగుపెడుతున్న తరుణంలో అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 27న నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో గులాబీ జెండాలు ఎగురవేసి సభకు బయలుదేరాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని, కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.
కేసీఆర్ సందేశం కోసం ప్రజలంతా ఉతంఠగా ఎదురు చూస్తున్నారన్నారు. ఎప్పటికైనా రాష్ట్రానికి బీఆర్ఎస్, కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అన్నారు. సమావేశంలో జిల్లా నాయకుడు జకు రాకేశ్, మండలాధ్యక్షులు జోడు శ్రీనివాస్, కుంభం రాఘవరెడ్డి, జవ్వాజి తిరుపతి, లింగంపల్లి శ్రీనివాస్ రావు, మందల రాజిరెడ్డి, యూత్ అధ్యక్షుడు రామిళ్ల కిరణ్, నాయకులు శాంతకుమార్, గీతాబాయి, ఎండీ అలీం, పంతకాని సడువలి, హరీశ్, కొండగొర్ల వెంకటస్వామి, గాలి సడువలి, రాదారపు స్వామి తదితరులు పాల్గొన్నారు.