హనుమకొండ, మే 13 : కార్మికుల హక్కుల కోసం పోరాడుదామని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల నేతలతో కలిసి కార్మిక హక్కుల చైతన్య మాసోత్సవ సదస్సు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్నట్లుగానే ఈసారి కూడా ఉద్యోగ, కార్మిక హక్కుల మాసోత్సవం జరుపుతున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని, బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సమాన పనికి సమాన వేతనం, కనీస పని గంటలు, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు ఇంకా లక్షలాది మంది కార్మికులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని, అందుకే కార్యక్షేత్రంలోకి వెళ్లి హక్కులపై అవగాహన కల్పించి, పోరాటంలో భాగం చేస్తామని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. బీఆర్టీయూ బాధ్యుడు నాయిని రవి మాట్లాడుతూ వినయ్‌భాస్కర్ నాయకత్వంలో కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్నామన్నారు. గిగ్ వర్కర్లకు కూడా కార్మిక చట్టాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
త్రిచక్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు ఈసంపల్లి సంజీవ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకిచ్చిన హామీలను మూడేళ్లు కావస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణంతో వందలాది మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్ర మంలో నాయకులు రాజు, గొర్రె విజయ్, ఎండీ ఇస్మాయిల్, దూలం వెంకన్న, పున్నం చందర్, ఖలీల్, సదానందం, పానుగంటి శ్రీధర్, మహేందర్, శ్రీధర్‌రెడ్డి, బాబు, శ్రీలత, విజయ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.