ఖమ్మం అర్బన్, ఆగస్టు 17 : ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, పీఆర్సీ, సీపీఎస్ రద్దు, ఆరు డీఏల విడుదలలో తీవ్ర జాప్యం చేస్తున్నారని, ఇదే ధోరణి కొనసాగితే సెప్టెంబర్ ఒకటో తేదీ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి హెచ్చరించారు. ఖమ్మం కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద సోమవారం పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఉపాధ్యాయులు తరలిరావడంతో ధర్నాచౌక్ దద్దరిల్లింది.
ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టాశేఖర్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దామోదర్‌రెడ్డి, భిక్షంగౌడ్లు మాట్లాడారు. సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి ఉపాధ్యాయుల పట్ల చులకనగా, వ్యంగ్యంగా మాట్లాడటం శోచనీయమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 6 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే వాటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెన్షనర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకటరెడ్డి, సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సతీశ్‌రెడ్డి, శ్రీధర్, సుబ్బయ్య, వేణు, మోత్కూరి మధు, యలమద్ది వెంకటేశ్వర్లు, ఝాన్సీసౌజన్య, రాము, విజయ్, అమృత్‌కుమార్, బ్రహ్మారెడ్డి, రత్నకుమార్, చిత్తలూరి ప్రసాద్, రమణ, రాయల నరసింహారావు, చెన్నకేశవరెడ్డి, రెబ్బా శ్రీనివాసరావు, సోమ్లా, లింగం సతీశ్ తదితరులు పాల్గొన్నారు.