హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : నిరుపేదలకు అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవా ఫలాలను ఉచితంగా అందించాలనే మహోన్నత ఆశయంతో కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్ ఎట్టకేలకు ప్రజలకు అందుబాటులోకి రావడంపై సోమవారం ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలోనే హైదరాబాద్ నగరం చుట్టూ నాలుగు వైపులా అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు అందుబాటులో ఉండాలన్న దూరదృష్టితో కేసీఆర్ వీటికి శంకుస్థాపన చేయడమే కాకుండా, బీఆర్ఎస్ హయాంలోనే శరవేగంగా పనులను పూర్తి చేయించారని తెలిపారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖానలపై పెరుగుతున్న రోగుల భారాన్ని తగ్గించి, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటళ్లకు ప్రత్యామ్నాయంగా పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడానికే టిమ్స్ వ్యవస్థకు కేసీఆర్ ప్రభుత్వం రూపకల్పన చేసిందని వివరించారు. గతంలో కేటీఆర్ సనత్‌నగర్ టిమ్స్‌ను సందర్శించి నిర్మాణ పనులు పరిశీలించిన సమయంలో నిరుపేదలకు అత్యాధునిక వైద్యం అందించడమే తమ ప్రభుత్వ ప్రాథమిక ధ్యేయమని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో రూపుదిద్దుకున్న సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్ పేదలకు ప్రాణరక్షక సంజీవనిగా నిలుస్తుందని కేటీఆర్ పేరొన్నారు. ఈ హాస్పిటల్ ప్రాంగణంలోనే 1,000 పడకలు, అత్యవసర చికిత్సల కోసం 300 ఐసీయూ బెడ్లు, 16 ఆధునిక ఆపరేషన్ థియేటర్లతో పాటు అవయవ మార్పిడీ విభాగం సిద్ధం చేసినట్టు వెల్లడించారు. వీటితో పాటు ఎంఆర్ఐ, సీటీ సాన్, ఎక్స్-రే, క్యాథ్ లాబ్స్, రేడియాలజీ, డయాలసిస్ సెంటర్ వంటి ప్రధాన డయాగ్నొస్టిక్ విభాగాలన్నీ ఒకేచోట కల్పించడం తెలంగాణ వైద్య రంగంలో గొప్ప మైలురాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కేవలం హైదరాబాద్ నగర వాసులకే కాకుండా, ప్రాణాపాయ స్థితిలో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి రాజధానికి వచ్చే పేద రోగులకు సనత్‌నగర్ టిమ్స్ కొండంత అభయం ఇస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ భారీ మౌలిక సదుపాయాల నిర్మాణంలో భాగస్వాములైన ఇంజినీరింగ్ బృందాలకు, వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్న డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, ఇతర పారామెడికల్ సిబ్బందికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ కోసం నగరవ్యాప్తంగా 350 బస్తీ దవాఖానలను విజయవంతంగా ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. దీనికి అదనంగా కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ సేవలను విస్తరించే క్రమంలో 4,000 పడకలతో పాటు ఆక్సిజన్ సదుపాయం కలిగిన 1,200 ఎమర్జెన్సీ బెడ్లను అందుబాటులోకి తెచ్చి, సాధారణ ప్రజల ఆరోగ్య భద్రతకు బీఆర్ఎస్ ప్రభుత్వం బలమైన పునాది వేసిందని పేర్కొన్నారు.
కేసీఆర్‌కు ఎకడ మంచి పేరు వస్తుందోనన్న రాజకీయ కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం టిమ్స్ ప్రాజెక్టును ఇన్నాళ్లూ జాప్యం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికైనా నిద్రలేచి అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్‌లను వేగవంతంగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. 2,000 పడకలతో రూపుదిద్దుకుంటున్న తెలంగాణలోనే అతిపెద్ద వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నిమ్స్ విస్తరణ పనులను కూడా త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.