హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీతో రెండు లక్షల ఉద్యోగాలు రానున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్‌లు న్యూఢిల్లీ నుంచి నిర్వహించిన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్(ఎన్ఐసీడీఐటీ) వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ.. 3,245 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ పారిశ్రామిక వాడకు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఈ స్మార్ట్ సిటీలో భూమి రూపంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం ఉండగా.. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసినట్టు వివరించారు.
ఇప్పటికే స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ)కి అభివృద్ధి ప్రణాళికను అందజేసినట్టు తెలిపారు. ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఈపీసీ) పద్ధతిలో జరుగుతున్న ఈ స్మార్ట్ సిటీ పనులు నిర్ణయించిన సమయానికి పూర్తవుతాయని వెల్లడించారు. భవ్య పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల్లో నాలుగింటిని తెలంగాణకు కేటాయించాలని మంత్రి పీయూష్ గోయల్‌ను శ్రీధర్‌బాబు కోరారు. మరోవైపు, టీ-వర్క్స్లాంటి సంస్థను ఢిల్లీలో ఏర్పాటు చేసేందుకు సహకరించాలని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్ మంజిందర్ సింగ్ సిర్సా.. శ్రీధర్ కలిసి కోరారు.