Bihar : బిహార్లో విషాదం జరిగింది. ఒక చెరువులో మునిగిన నలుగురు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బిహార్, ఈస్ట్ చంపారన్ జిల్లా, ఇనర్వభార్ పంచాయత్ పరిధిలోని బంకాట్ గ్రామంలో శుక్రవారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని పహర్పూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం, బంకాట్ గ్రామానికి చెందిన ఐదుగురు బాలికలు స్థానిక చెరువుకు ఉదయం 9.30 గంటల సమయంలో స్నానం చేసేందుకు వెళ్లారు.
ఐదుగురు బాలికలలో నలుగురు నీటిలోకి వెళ్లగా.. ఒక బాలిక ఒడ్డునే ఉండిపోయింది. లోపలికి వెళ్లిన బాలికలు లోతును అంచనా వేయలేకపోయారు. అలా ఇంకా నీటిలోకి వెళ్లి మునిగిపోయారు. కళ్లముందే నలుగురు మునిగిపోవడంతో అక్కడే ఉన్న బాలిక పక్కనే ఉన్న కొందరికి వెంటనే విషయం చెప్పింది. వెంటనే సమాచారం అందుకున్న గ్రామస్తులు, పోలీసులు అక్కడికి చేరుకుని బాలికల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చెరువులో గల్లంతైన నలుగురు బాలికల మృతదేహాల్ని వెలికితీశారు. మృతుల్లో ఇద్దరు అక్కాచెల్లెలు కూడా ఉన్నారు. మృతులంతా 13 ఏళ్లలోపు బాలికలే.
వారి వివరాలివి. సోనావతి కుమారి (13), ఆమె చెల్లి ఫూల్వతి కుమారి (10), సోనాలి కుమారి (10), ప్రతిభా కుమారి (12). వీరి మృతదేహాల్ని పోలీసులు స్థానిక మోతిమరి సర్దార్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. పిల్లలు ఇలా మరణించడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పిల్లలు ఎలా మరణించారో పోస్టుమార్టం రిపోర్టు తర్వాత వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని జిల్లా మెజిస్ట్రేట్ సౌరభ్ సుమన్ ప్రకటించారు.