ముంబై, ఆగస్టు 17: పండుగ సీజన్ వచ్చిదంటే చాలు..తాత్కాలిక ఉద్యోగ అవకాశాలు లక్షల్లో పుట్టుకొస్తున్నాయి. ఈ-కామర్స్, లాజిస్టిక్, క్విక్ కామర్స్, సంఘటిత రిటైల్, బీఎఫ్ఎస్ఐ రంగాల్లో తాత్కాలిక ఉద్యోగులకు ఎనలేడి డిమాండ్ ఉన్నది. ప్రస్తుత పండుగ సీజన్లో 2.5 లక్షల నుంచి 2.7 లక్షల వరకు గిగావర్కర్లకు డిమాండ్ ఉండనున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి గిగా వర్కర్లకు డిమాండ్ 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని టాలెంట్ కంపెనీ అడెక్కో ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గడిచిన ఏడాది పండుగ సీజన్లో 2.16 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. దేశవ్యాప్తంగా 100కి పైగా కార్పొరేట్ సంస్థల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈనివేదికను రూపొందించింది.
ఈ ఏడాది ద్వితీయ శ్రేణి నగరాల్లోనే గిగావర్కర్లకు డిమాండ్ అధికంగా ఉంటుందని సర్వే అంచనావేస్తున్నది. ప్రధానంగా లక్నో, భువనేశ్వర్, జైపూర్, కోయంబత్తూరు వంటి నగరాల్లో అధికంగా ఉంటాయని అంచనా. ఇదే సమయంలో మెట్రో నగరాలైన ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఉద్యోగుల ప్రతిభ కొరత అధికంగా ఉన్నదని, గతేడాదితో పోలిస్తే 30 శాతం తగ్గనున్నదని పేర్కొంది. తాత్కాలిక ఉద్యోగుల జీతభత్యాలు మెట్రో నగరాల్లో 12-15 శాతం వరకు పెరుగనుండగా, ద్వి, తృతీయ శ్రేణి నగరాల్లో 8-10 శాతం అధికం కావచ్చునని అంచనావేస్తున్నది.
‘ప్రపంచవ్యాప్తంగా సంక్లిష్టమైన వాతావరణం ఉన్నప్పటికీ ఈ ఏడాది పండుగ సీజన్లో నియామకాల పట్ట ఆసక్తి బలంగా ఉన్నది. రిటైల్, ఈ-కామర్స్, లాజిస్టిక్స్, ఇతర వినియోగదారుల విభాగాల్లో డిమాండ్ అధికంగా ఉన్నది. భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఇంధన ధరల అస్థిరత, మారుతున్న ప్రపంచ వాణిజ్య గతిశీలత, ఎగుమతి-ఆధారిత పరిశ్రమల్లో కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో యజమానులు మరింత జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
– దీపేశ్ గుప్తా, అడెక్కో ఇండియా డైరెక్టర్