హనుమకొండ, నవంబర్ 1: తెలంగాణ ఉద్యమకారులకు ఎమ్మెల్యే, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అండగా నిలిచారని కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రైతురుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేసులకు భయపడకుండా వినయ్ భాస్కర్ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌తో ముందుకు సాగారని తెలిపారు. నాడు అసెంబ్లీపై నల్ల జెండా ఎగురవేసినందుకు వినయ్భాస్కర్పై పోలీస్ నిర్బంధం ఉన్నప్పటికీ సంకల్పంతో ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. ఇలాంటి నాయకుడిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ విద్యార్థులు, ఉద్యమకారులు, అన్నికులాలు, వర్గాలు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు అన్ని వర్గాలు నాలుగుసార్లు భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. పశ్చిమ వర్గ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్‌ను మళ్లీ భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషిచేయాలని కోరారు. పదేండ్లలో నగరాన్ని, పశ్చిమ నియోజకవర్గాన్ని గణనీయంగా అభివృద్ధి చేశారని తెలిపారు. అభివృద్ధిపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. రూ.5వేల కోట్లతో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, భద్రకాళిబండ్, కాళోజీ కళాక్షేత్రం, జంక్షన్ల అభివృద్ధి, అనేక నాలాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని వివరించారు. అపార్ట్మెంట్ దర్శన్, కార్మిక మాసోత్సవాలు వంటి కార్యక్రమాలతో సమస్యల పరిష్కరానికి కృషి చేశారని పేర్కొన్నారు.
సంక్షేమం, అభివృద్ధే బీఆర్ఎస్ ఎజెండా అని తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యమకారులందరూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్‌కు గిఫ్ట్ ఇవ్వాలని కోరారు. పదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించి ఇతర రాష్ర్టాలకు రోల్‌మాడల్‌గా నిలిచిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తోందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో హనుమకొండకు ప్రత్యేక స్థానం ఉందని, ఇకడున్న మేధావులు, అన్నివర్గాలు ఉద్యమంలో పాల్గొన్నాని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పిన మాటలు విని ఓటు వేసి మోసపోతే మనమే గోసపడతామని చెప్పారు. సుభిక్షంగా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. ఉద్యమకారులు జన్ను జకార్య, శోభన్‌బాబు, జనార్థన్, ఉడుతల సారంగపాణి, నార్లగిరి రమేశ్, నయీముద్దీన్, ఖాజా సిరాజుద్దీన్, సల్వాజీ రవీందర్రావు, సిరిమల్ల సదానందం పాల్గొన్నారు.