మహబూబాబాద్, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వరద సృష్టించిన బీభత్సం మానుకోటకు మానని గాయం చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిల్లాను అతలాకుతలం చేసి ఇల్లు, వాకిలి, పంట పొలాలన్నింటినీ తుడిచిపెట్టేసి ప్రజలకు తీరని నష్టం మిగిల్చింది. 75 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఆగస్టు 30, 31, సెప్టెంబర్ 1 తేదీల్లో కురిసిన అతి భారీ వ ర్షాలతో మహబూబాబాద్ ఆగమాగమైం ది. వరద ఉధృతికి రైలు, రోడ్డు మార్గాలు తెగిపోయి జనజీవనం అస్తవ్యస్తమై జిల్లాతో సం బంధాల లేకుండా పోయాయి. మూడు చోట్ల రైల్వే ట్రాక్ కొట్టుకుపోగా, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు కొట్టుకుపోవడంతో వేలాది ఇళ్లు నేలకూలాయి.
వేల ఎకరాల్లో పంట దెబ్బతిని రైతు ల భూముల్లోకి ఇసుక మేటలు, రాళ్లు వచ్చి చేరాయి. ఇంట్లో నిత్యావసరాలు, సామగ్రి ఏవీ లేకుండా వరద పాలై తిందామంటే తిండీ లేక, ఉండేందుకు ఇల్లు లేక నరకం చూశారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి పర్యటించి వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చినా అది పూర్తిస్థాయిలో నెరవేరలేదు. బాధితులకు అరకొర సాయం చేసి చేతులు దులుపుకొన్నారు. మానుకోట జి ల్లాను జలప్రళ యం ముంచెత్తడం తో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఈఏడాది కంటిమీద కునుకు లేకుండా చేసిం ది. మళ్లీ ఇలాంటి విపత్తు వస్తే మా పరిస్థితి ఏమిటనేది తలుచుకుంటేనే భయంగా ఉందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
నెల్లికుదురు మండలం రావిరాలలో అక్ట్టోబర్ 31 రాత్రి గ్రామంలోకి ఒక్కసారిగా భారీగా వరద వచ్చింది. ఊరు మొత్తం మునిగిపోయింది. ఇండ్లలోకి మస్తు నీళ్లు వచ్చినయ్. బల్లలపై, ఇంటి సజ్జలపై ఉన్నాం. భయంభయంగా బతికినం. గ్రామంలో నాలుగు కుటంబాలు మమ్ముల కాపాడండి అంటు రాతంత్రా డాబాపై గొడుగులు పట్టుకొని తలదాచుకున్నారు. ఇళ్లన్నీ కూలిపోయినయ్. పంట పొలాలన్నీ మునిగిపోయినయ్. జీవాలు, ఇంటి ముందు ఉన్న బండ్లు నీళ్లలో బతుకమ్మల్లెక్క కొట్టుకపోయినయ్. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు.
– ఆకుల జగ్గయ్య, రావిరాల