అతి భారీ వర్షాలతో మానుకోట కకావికలమై వరద ధాటికి కూడు, గూడు, గొడ్డూగోద తుడిచిపెట్టుకుపోయాయి. ఊరేదో, ఏరేదో గుర్తుపట్టలేని విధంగా పెను బీభత్సం సృష్టించడంతో ఇల్లు, పంట పొలాలు కోల్పోయి రైతులు, ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 52 సెం.మీ వర్షపాతం కురిసి మానుకోట జిల్లా అల్లకల్లోలమైనప్పటికీ కాంగ్రెస్ సర్కారు మాత్రం పరిహారం విషయంలో బాధితులకు మొండిచేయి చూపింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించి ఆదుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ కొందరికే నష్టపరిహారం అందించడంపై బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్‌కు మాట తప్పడం అలవాటుగా మారిందని.. రైతు రుణమాఫీ.. రైతుభరోసా ఇలా పథకం ఏదైనా తప్పించుకోవడమే పనిగా పెట్టుకుందని ‘కొండంత నష్టం జరిగితే గోరంత సాయం’ చేసిందంటూ పరిహారం కోసం ఎదురుచూస్తున్న రైతులు, ప్రజలు మండిపడుతున్నారు.
– మహబూబాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ)
ఆగస్టులో కురిసిన అతి భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలోనే మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం వాటిల్లింది. మహబూబాబాద్ జిల్లా ఆకేరు వాగు విలయతాండవం చేయడంతో వాగు చు ట్టూ తండాలు, గ్రామాలు, పంటపొలాలు కొట్టుకుపోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సెప్టెంబర్ 1న ఆకేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో వాగు పరివాహక ప్రాంతాలు అతలాకుతలమయ్యా యి. మరిపెడ మండలం సీతారాంతండా, ఉల్లేపల్లి, నెల్లికుదురు మండలం సీతారాం తండా, డోర్నకల్ మం డలం దుబ్బతండాలు వరద ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఇళ్లు పచ్చని పంట పొలాలు ఆకేరు నీటి ప్రవాహంతో ప్రకృతి మనోహరంగా ఉండే తండాలు, గ్రామాలు ఆగమయ్యాయి.
ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినా..
సెప్టెంబర్ 3న స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి మరిపెడ మండలం సీతారాంతండాకు వచ్చి బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తండావాసులకు మరోచోట ప్రభుత్వ స్థలం ఇచ్చి ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామ ని హామీ ఇ చ్చారు. తక్షణ సాయం కింద ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పా రు. కానీ నేటికి వరదలు వచ్చి 41రోజులు గడిచినా హామీలకు దిక్కులేకుండా పోయింది.
తండాను మార్చడం దేవుడెరుగు నష్టపరిహారం కూడా అందకపోవడంతో తం డావాసులు, రైతులు దీనంగా ఎదురుచూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 18,406 మంది రైతులకు సంబంధించి 14,669.22 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నిర్ధారించారు. ఎకరాకు రూ.10వేల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చి, నిధులు విడుద ల చేసినా రైతుల బ్యాంకు ఖాతాలో ఇప్పటివరకు నగ దు జమ కాలేదు. వరదల ధాటికి జిల్లాలో 610 ఇళ్లు లు కూలిపోగా, 1,180 ఇళ్లు వరదలో మునిగిపోయా యి. కూలి పోయిన ఇళ్లకు రూ.16,500, నీట మునిగిన ఇళ్లకు రూ.10వేల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చి అరకొరగా అందించి చేతులు దులుపుకొన్నారు.
రెక్కాడితే డొక్కాడని ని రుపేద కుటుంబం మా ది. మాకు గుంట భూ మి కూడ లేదు. రోజు ఖ మ్మం వెళ్లి హోటల్లో సప్లయర్‌గా పనులు చేస్తే నే పూట గడిచేది. అర్ధరాత్రి ఆకేరు వాగు మా ఇంటిని ముంచింది. మరో ఫీటు నీళ్లు వస్తే అందరం చచ్చిపోయేటోళ్లం. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నీళ్లలో కొట్టుకుపోయాయి. ప్ర భుత్వం కేవలం 10వేలు మాత్రమే ఇచ్చిం ది. స్వయంగా సీఎం వచ్చినా ఇల్లు చూసిం డ్రు. ఢిల్లీ సార్ వాళ్లు కూడా వచ్చిన్రు. ఫొటో లు తీసుకున్నరు. రోజులు గడుస్తున్నా పట్టించుకున్నోళ్లు లేరు. పైరవీ చేయించుకున్నోళ్లకు రూ. 16,500 వచ్చె. గింత అన్యాయం ఉంటదా ఎక్కడన్నా.
– ఇస్లావత్ మంగీలాల్, హోటల్ సప్లయర్
నాకు ఐదెకరాల భూమి ఉంది. 158 సర్వే నంబర్ పురుషోత్తమాయగూడెం పరిధిలో, 110, 148 సర్వే నంబర్ తండా ధర్మారం పరిధిలో ఉంది. అందులో మూడెకరాలు మామిడితోట, మరో రెండు ఎకరాలు వరి వేసిన. వరదకు పంట కొట్టుకుపోవడమే కాకుండా మామిడిచెట్లు కూకటివేళ్లతో లేచిపోయాయి. వ్యవసాయ భూమిలో ఇసుక మేటలు వచ్చి చేరాయి. గియన్ని కండ్ల ముందే ఉన్నా అధికారులు సర్వే చేయాలంటున్నరు. మామిడిచెట్లు లేవు సార్ అంటే అన్నీ పోలేదు కదా అని అధికారులు అంటున్నరు.
ఎకరానికి పది వేల రూపాయలు అన్నరు ఇంతవరకు రాకపాయె. పంటలు కొట్టుకుపోగానే సీఎం సర్ వచ్చిండని సంబురపడ్డం. సీఎం వచ్చిపోయినా అధికారులైతే రాలే. మళ్లీ వారానికి ఢిల్లీ సార్లు వచ్చిండ్రు.. పోయిండ్రు. ఎమ్మార్వో ఆఫీసోళ్లను అడిగితే అన్ని మామిడిచెట్లు పోయినట్లు అనిపించడం లేదన్నరు. కండ్ల ముంగట పంట నష్టం కనిపిస్తున్నా అధికారులు ఇలా మాట్లాడుదేంది. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పంట నష్టం రాలేదు.
– గుగులోత్ రాంజీ, సీతారాంతండా, రైతు
అకాల వరదలతో మా ఇళ్లు నీట మునిగింది. ఇంట్లో బియ్యం, ఉప్పు, పప్పు, అన్ని తడిసి ముదయ్యాయి. మా అత్తమ్మ పేషెంట్, ఇంట్లోకి వచ్చి న వరదతో భయపడి తెల్లవార్లు గోడ ను పట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఉన్నం. వరద రాని ఇళ్లకు డబ్బులు వచ్చాయి. వరదలో మునిగిన మా ఇళ్లును సర్వే చేయలేదు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి నయాపైసా రాలేదు. గ్రామ కార్యదర్శి, తహసీల్దార్‌ను రీ సర్వే చేయాలని అడిగినా పట్టించుకుంటలేరు. ఇప్పటికైనా ప్రభుత్వం మమ్ముల్ని ఆదుకోవాలి.
– చుక్క స్వరూప, రావిరాల, నెల్లికుదురు