ఆత్మకూరు/సుబేదారి, సెప్టెంబర్ 8: ప్రజల జీవితాలను ఆగం చేసే పేకాటపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. క్లబ్బులకు పూర్తిగా అనుమతులు తొలగించింది. సామాన్య, మధ్య తరగతి సంసారాల్లో చిచ్చు పెట్టే పేకాట ఎక్కడ ఉన్నా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నది. పోలీసు శాఖ నిత్యం ఈ వ్యవహారాలపై చర్యలు చేపడుతున్నది. పేకాట నిర్వహణతో కొందరు అధిక ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. పేకాట కేంద్రాలను ఏర్పాటు చేసి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వరంగల్ నగరంలోని శివారు హోటళ్లు వీటికి అడ్డాగా మారుతున్నాయి. పెద్ద హోటళ్లలో పేకాట నిర్వహణ దందా సాగుతున్నది. సెలవుల్లో, ముఖ్యంగా ఆదివారాల్లో పేకాట నిర్వహణ ఎక్కువగా జరుగుతున్నది. శివారులోని హోటళ్లపై నిఘా పెట్టిన పోలీసులు తాజాగా ఆత్మకూరు పోలీసు స్టేషన్ పరిధిలోని ఎన్ఎస్ఆర్ హోటల్ యజమాని ఇంట్లో పేకాట శిబిరంపై దాడి చేశారు.
ఎన్ఎస్ఆర్ సంస్థల యజమాని నాయినేని సంపత్‌రావు ఇంట్లో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఎన్ఎస్ఆర్ సంస్థల యజమాని సంపత్‌రావు ఇంట్లో సోదాలు చేశారు. ఎనిమిది మందితోపాటు సంపత్‌రావును కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఆత్మకూరు సీఐ గణేశ్ తెలిపారు. హనుమకొండకు చెందిన బండి బలరామకృష్ణ, ముస్కె శివారెడ్డి, సూరం దామోదర్‌రెడ్డి, వద్దిరాజు కవికుమార్, కొల్లూరి అరుణ్, వరంగల్‌లోని రామన్నపేటకు చెందిన రాచర్ల గోపి, కాజీపేటకు చెందిన కంకణాల కర్ణాకర్‌రెడ్డి, దామెరకు చెందిన మునిగే రణధీర్‌ను అరెస్ట్ చేసినట్లు వివరించారు. నిందితుల నుంచి రూ.3.59లక్షల నగదు, ఎనిమిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎన్.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని బృందం ఆదివారం రాత్రి ఈ దాడులను నిర్వహించిందని తెలిపారు. వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో ఆదివారం మరో మూడు చోట్ల పేకాట శిబిరాలపై దాడులు టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించింది. ఇంతెజార్గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీనివాసకాలనీలో ఆరుగురుని ఆరెస్టు చేసి రూ.6.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రీన్స్కేర్ ప్లాజాలో ఎనిమిది మందిని అరెస్టు చేసి రూ.62వేలను స్వాధీనం చేసుకు న్నారు. మట్టెవాడ పోలీసుస్టేషన్ పరిధిలోని ఆటోనగర్‌లో ఏడుగురిని అరెస్టు చేసి రూ.10వేలను స్వాధీనం చేసుకున్నారు.