వరంగల్, నవంబర్ 8: భద్రకాళీ చెరువు పూడికతీత పనుల్లో భాగంగా నీటిని తొలగించే ప్రక్రియను మత్స్యకారులు అడ్డుకున్నారు. మత్తడి కట్టను గండి కొట్టి నీటిని వదలడంపై ఇరిగేష న్, మత్స్య శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘చెరువును నమ్ముకొని బతుకుతున్నాం.. మా పొట్టలు కొట్టొద్దు’ అంటూ నినాదాలు చేశారు. సుమారు రెండు కోట్ల విలువైన చేపలు చెరువులో ఉన్నాయని, అకస్మాత్తుగా చెరువులోని నీటిని పూర్తిగా తొలగిస్తే వాటి పరిస్థితి ఏంటని ప్రశ్పించారు. తాతల కాలం నాటి నుంచి చెరువుపై ఆధారపడి బతుకుతున్న 450 కుటుంబాలు జీవనాధారం కోల్పోతాయని అధికారులకు తెలిపారు. తమకు ఉపాధి అవకాశాలు చూపెట్టిన తర్వాతనే చెరువులోని నీటిని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు.
మత్స్యకార సొసైటీ ప్రతినిధులతో ఇరిగేషన్, మత్స్యశాఖ అధికారులు చర్చలు జరిపారు. చెరువులోని చేపలు బయటికి వెళ్లకుండా తూముల వద్ద జాలీలు ఏర్పాటు చేసేందుకు అధికారులు అంగీకరించారు. 2024-25 సంత్సరానికి చెరువు లీజ్ రుణం మాఫీ కోసం ప్రతిపాద నలు మత్స్య శాఖ డైరెక్టర్‌కు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది భద్రకాళీ చెరువులో చేపలు పట్టుకొనేందుకు హక్కు పత్రాలు, వచ్చే ఏడాది చెరువు కౌలు భద్రకాళీ మత్స్యకార సొసైటీకి ఇస్తామని చెప్పారు. ఈ ఏడాది భద్రకాళీ చెరువుకు కేటాయించిన 1.90 లక్షల చేప పిల్లలు వేరే చెరువులో వేసుకునేందుకు అధికారులు అనుమతిచ్చారు.