మత్స్యకారులకు ఉపాధి చూపే చేపపిల్లలు ఈసారి ఇంకా చెరువును చేరలేదు. కులవృత్తులకు పెద్దపీట వేసిన గత బీఆర్ఎస్ సర్కారు ఏటా ఈ సమయానికి సీడ్ అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడింది. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు ముదిరాజ్‌లకు ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై వారిలో ఆందోళన వ్యక్తమవుతున్నది. గతేడాది ఈ సమయానికి భూపాలపల్లి జిల్లాలో రూ.3 కోట్ల సీడ్‌ను చెరువుల్లో వదలగా, ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు టెండర్లు ఖరారు కాకపోవడంతో వారి ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది.
– జయశంకర్ భూపాలపల్లి, జూలై 29 (నమస్తే తెలంగాణ)
కులవృత్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి పూర్వవైభవం తీసుకొచ్చిన ఘనత గత కేసీఆర్ సర్కార్‌దే. కాగా, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేసిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలో ముదిరాజ్‌లకు చేయూతనిచ్చిన ఉచిత చేప పిల్లల(సీడ్) పంపిణీ పథకాన్ని సైతం కాలరాస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటివరకు చేప పిల్లల పంపిణీకి సంబంధించి టెండర్లు నిర్వహించకపోవడంతో ముదిరాజ్ కులస్తులు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా ఈ సమయానికే టెండర్లు నిర్వహించి చేప పిల్లలను చెరువుల్లో వదిలేది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2022-23వ సంవత్సరం లో 3కోట్లు, 2023-24లో 2.57 కోట్ల చేప పిల్లలను ఆగస్టు మొదటి వారంలోపే చెరువుల్లో వదిలింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటివరకు చేప పిల్లల పంపిణీ పథకం ఊసెత్తకపోవడం తో జిల్లాలోని116 సొసైటీల్లోని సభ్యులఉపాధి ప్రశ్నార్థకంగా మారింది.
ఆలస్యంగానైనా చేప పిల్లల పంపిణీకి టెండర్లు పిలిచిన ప్రభుత్వం మళ్లీ ఎందుకు రద్దు చేశారని మత్స్యకారులు మండిపడుతున్నారు. ఈ నెల 23న టెండర్లకు చివరి తేదీగా నిర్ణయించిన ప్రభుత్వం టెండర్లు ఓపెన్ చేయాల్సి ఉందని ఆ శాఖ అధికారులే ప్రకటించారు. కానీ, ఉన్నట్లుండి టెండర్లను వాయిదా వేశారు. టెండర్లలో కాంట్రాక్టర్లు ఎవరూ పాల్గొనలేదా..? కావాలనే వాయిదా వేశారా..? ఈ ఏడాది సీడ్ పంపిణీ ఉంటుందా లేదా..? అనే అనుమానాలు మత్స్యకారుల్లో తలెత్తుతున్నాయి. ఏటా జూలైలో టెండర్లు నిర్వహించి ఆగస్టు మొదటి వారంలోపే చేప పిల్లల పంపిణీ జరిగేది. ఆగస్టు 2న టెండర్లు నిర్వహిస్తారని అధికారులు చెబుతున్నప్పటికీ టెండర్లు, ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేసి, కాంట్రాక్టర్లను ఫైనల్ చేసి ఎప్పుడు సీడ్ పంపిణీ చేస్తారని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 116 సొసైటీలు 8785 మంది సభ్యులు ఉన్నారు. గత ప్రభుత్వం 833 చెరువుల్లో చేపపిల్లల సీడ్ వేసింది. భూపాలపల్లి మండలంలో 17 సొసైటీలు 1221 మంది సభ్యులు ఉన్నారు. చిట్యాలలో 13 సొసైటీలు 1013 సభ్యులు, ఘణపురంలో 9 సొసైటీలు 1341 సభ్యులు, కాటారంలో 8 సొసైటీలు 356 సభ్యులు, మహదేవపూర్‌లో 7 సొసైటీలు 381 సభ్యులు, మహాముత్తారంలో 3 సొసైటీలు 141 సభ్యులు, మల్హర్‌లో 6 సొసైటీలు 574 సభ్యులు, మొగుళ్లపల్లిలో 12 సొసైటీలు 721 సభ్యులు, పలిమెలలో ఒక సొసైటీ 35 సభ్యులు, రేగొండలో 27 సొసైటీలు 2294 సభ్యులు, టేకుమట్లలో 13 సొసైటీలు 708 సభ్యులు ఉన్నారు. జిల్లాలోని రేగొండ మండలంలో అధికంగా సొసైటీలు, సభ్యులు ఉన్నారు.