హనుమకొండ సబర్బన్, జూలై 8 : కేసీఆర్ కలల పంట ఆయిల్‌పామ్ చేతికొచ్చింది. స్వరాష్ట్రం సాకారమైన తర్వాత వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న తొలి ముఖ్యమంత్రి.. సంప్రదాయ సాగుకు భిన్నంగా దీర్ఘకాలికంగా అధిక లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించడంతో రైతుల్లో ఆసక్తి పెరిగింది. అదే ఉత్సాహంతో మూడేళ్ల క్రితం చాలామంది రైతులు పంట సాగుచేయగా హనుమకొండ జిల్లా రైతు సారంగపాణికి చెందిన 12 ఎకరాల ఆయిల్‌పామ్ తోట ప్రస్తుతం చేతికొచ్చింది. తొలి పంట కోతకు రావడంతో వారం రోజుల్లో గెలలను కోయించి ఫ్యాక్టరీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతో ఇష్టంగా వేసిన పంట మొదటి దిగుబడి చేతికొస్తుండడంతో ఆ రైతు కమ్ రిటైర్డ్ ప్రొఫెసర్ కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
కేసీఆర్ కలల పంట ఆయిల్‌పామ్ హనుమకొండ జిల్లాలో తొలి దిగుబడి ప్రారంభానికి సిద్ధమైంది. జిల్లాలోని వేలేరు మండలం గుండ్లసాగర్ గ్రామ శివారులో రైతు సారంగపాణికి సంబంధించిన 12 ఎకరాల తోటలో ఆయిల్‌పామ్ గెలలను కోసేందుకు ఉద్యానశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ వ్యవసాయరంగంలో దేశీయ అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
ఇందులో ప్రధానంగా పామాయిల్‌ను భా రీ ఎత్తున దిగుమతి చేసుకుంటున్నట్లు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో ఆయిల్‌పామ్ పంట సాగు సాధ్యాసాధ్యాలను తెలుసుకున్న అనంతరం సాగుకు అనుకూలమైన వాతావరణం ఉన్నట్లు శాస్త్రవేత్తలు సూచించడంతో రైతులతో సాగు చేయించేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికలు రూపొందించారు. ఈ క్రమంలో తొలుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఐనవోలు, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లో 26 ఎకరాల్లో పంట సాగుకు రైతులు శ్రీకారం చుట్టారు. సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాలు కూడా ఉద్యాన శాఖ రైతులకు అందించింది. దీంతో నాలుగో ఏడాదైన ప్రస్తుత ఏడాది దిగుబడి ప్రారంభమైంది.
మొదట కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్ అయిన సారంగపాణి తోటలో గెలలను కత్తిరించే ప్రక్రియను మొద లు పెట్టనున్నారు. ఇందుకోసం ఉద్యాన శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వారం రోజుల్లో తేదీని నిర్ణయించి ప్రజాప్రతినిధులతో పాటు భారీ ఎత్తున రైతులను కూడా సమీకరించి తొలి కోత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయరంగంలో పెనుమార్పులను తీసుకొచ్చింది. ఇందులో ప్రధానంగా భూగర్భ జలాల పెంపు కోసం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పూడికతీత కార్యక్రమంతో పాటు ప్రపంచంలోనే ప్రసిద్ధికెక్కిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించడంతో పాటు వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్‌ను అందించింది. దీంతో దేశంలోని అన్ని రాష్ర్టాల్లో చూసుకుంటే గతంలో అట్టడుగు స్థానంలో ఉన్న తెలంగాణ ప్రథమ స్థానానికి ఎగబాకింది. ఇదే క్రమంలో విప్లవాత్మక రీతిలో కేసీఆర్ తీసుకొచ్చిన ఆయిల్‌పామ్ పంట దిగుబడులు నేడు ప్రారంభమయ్యాయి. కొన్ని జిల్లాలో ఇప్పటికే తొలి కోతలు పూర్తవ్వగా హనుమకొండ జిల్లాలో మాత్రం ప్రస్తుతం మొదలయ్యాయి.
మరో 6 నెలల్లో ఇంకో 1600 ఎకరాల్లో గెలలు కత్తిరింపునకు రానున్నాయి. దీంతో జిల్లాలో అయిల్‌పామ్ పంట హడావుడి ఊపందుకోనుంది. ప్రస్తుతం జిల్లాలో 3,584 ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్ పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మరో 4వేల ఎకరాల సాగు లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇందులో 607ఎకరాల్లో మంజూరు ప్రక్రియ పూర్తయ్యింది. మిగతా టార్గెట్‌ను పూర్తి చేసేందుకు ఉద్యానశాఖతో పాటు కొత్తగా వ్యవసాయశాఖ అధికారులకు కూడా లక్ష్యాన్ని నిర్దేశించారు. దిగుబడి తర్వాత కత్తిరించిన గెలలను సేకరించేందుకు జిల్లా ఏజెన్సీ సంస్థ కేఎన్ బయోసైన్స్ ఆత్మకూరు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల పరిధిలో ప్రస్తుతం మూడు కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
రానున్న రోజుల్లో మరిన్ని కేంద్రాలను నెలకొల్పేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం కోతకు వచ్చిన గెలలను తామే సేకరించి ఇతర ఫ్యాక్టరీల్లో ఆయిల్ క్రషింగ్ చేయించుకుంటామని సదరు సంస్థ యాజమాన్యం రైతులకు చెబుతుంది. కాగా ఇటీవల ములుగు జిల్లా ఇంచర్ల గ్రామంలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూకేటాయింపులు చేశారు. ఆగస్టులో భూమిపూజ పనులు పూర్తి చేసి ఫ్యాక్టరీ పనులను ప్రారంభించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వచ్చిన ఆయిల్‌పామ్ సాగు ఆలోచన రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో గేమ్‌ఛేంజర్‌గా మారనుందని పలువురు చెబుతున్నారు. ఇదే కాకుండా దేశ ఆయిల్‌పామ్ దిగుమతుల్లో పెనుప్రభావం చూపనుందని అంటున్నారు.
రైతులు పెద్ద ఎత్తున ఆయిల్‌పామ్ పంటను సాగు చేసుకోవాలి. వ్యవసాయరంగంలో ఇతర పంటల్లో నష్టాలు వస్తున్నందున మంచి లాభాలు వచ్చేటువంటి ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించాలి. ఈ పంట పెట్టుబడి విషయంలో ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తున్నది. సాగు చేసే రైతులకు ఉద్యానశాఖ నుంచి అన్ని రకాల సలహాలు కూడా అందిస్తున్నది. మార్కెటింగ్‌కు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం జిల్లాలో మొదటి కోత ప్రారంభమైంది. మరో ఐదు, ఆరు నెలల్లో పెద్ద ఎత్తున ఆయిల్‌పామ్ గెలలు కోతకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. – అనసూయ, జిల్లా ఉద్యానశాఖ అధికారి
ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతాంగానికి మా సంస్థ అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. పంట పండిన తర్వా త మార్కెటింగ్ విషయంలో రైతులు ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జిల్లాలో మూడు గెలల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశాం. త్వరలోనే వీటి సంఖ్యను మరింత పెంచుతాం. ములుగు జిల్లా ఇంచర్లలో ఫ్యాక్టరీ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తాం. మా సంస్థ తరపున రైతాంగానికి పూర్తిస్థాయిలో సాంకేతిక సలహాలను అందిస్తున్నాం. మా సిబ్బంది ఎప్పుడు రైతులకు అందుబాటులో ఉంటారు. – సుధారెడ్డి, ఎండీ, కేఎన్ బయోసైన్స్ లిమిటెడ్
నేను కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూనే గుండ్లసాగర్ గ్రామశివారులో 12 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాను. రాళ్లు రప్పలుగా ఉన్న భూమిలో ఏ పంట సాగు చేయాలని యోచిస్తున్న సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయిల్‌పామ్ పంట సాగును ప్రోత్సహించారు. ఈ ఆయిల్‌పామ్‌ను 2022-23 సంవత్సరంలో నాకున్న 12 ఎకరాల్లో నాటాను. దీనికి ఉద్యానశాఖ అధికారులు ప్రోత్సాహాన్ని అందించారు. దీంతో పాటు సలహాలను అందించారు. ప్రస్తుతం మొదటి పంట కోతకు వచ్చింది. మరో నాలుగైదు రోజుల్లో అధికారుల సమక్షంలో గెలలను కత్తిరిస్తాం.
– సారంగపాణి, రైతు, గుండ్లసాగర్, వేలేరు మండలం