గీసుగొండ, సెప్టెంబర్ 30 : అన్ని అర్హతలున్నా రైతులకు ఎందుకు రుణమాఫీ చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం దశల వారీగా రైతుల రుణాలు మాఫీ చేయటానికి సిద్ధంగా ఉందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని రైతులు నిలదీశారు. గీసుగొండ మండలం ఊకల్ రైతు సహకార సంఘం 40వ మహాజన సభ సోమవారం చైర్మన్ బొమ్మాల రమేశ్ అధ్యక్షతన ఏర్పాటుచేయగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న రైతులు, రైతు సంఘం నాయకులు మోర్తాల చందర్రావు, శ్రీనివాస్, ప్రభాకర్‌రెడ్డి, గోనె కుమారస్వామి, తదితరులు ఎమ్మెల్యే దృష్టికి రుణమాఫీ అంశాలపై ప్రశ్నించారు. ఆధార్‌కార్డు నంబర్లు తప్పులని, రేషన్‌కార్డులు లేవని అనేక కొర్రీలను చూపుతూ రైతులకు రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తప్పులు చేసిన అధికారులపై చర్యలు తీసుకొని షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం రేషన్ కార్డులే ఇవ్వకుండా రేషన్ కార్డు ఉన్న వారికే రుణమాఫీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో సమావేశంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఎమ్మెల్యే స్పందించి రైతులు సహకరించాలని, అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని బడ్జెట్ లేక రుణమాఫీ ఆలస్యం అవుతున్నదని చెప్పారు. ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు లేని వారికి దసరా లోపు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదన్నారు. రూ.2 లక్షల రుణం ఉన్న రైతులకు ఐదు విడుతల్లో రుణమాఫీ అవుతుందని తెలిపారు. దసరాలోపు రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఊకల్ సహకార సంఘంలో 2,739 మంది రైతులుండగా అందులో 1,518 మంది రూ.18.56 కోట్ల రుణమాఫీ వచ్చిందని ఇంకా 1,221 మందికి రూ.18 కోట్ల డబ్బులను ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి రుణమాఫీ డబ్బులు వచ్చేలా చూస్తానని తెలిపారు. రుణమాఫీ రాని రైతుల కోసం సొసైటీలో నోడల్ అధికారిని నియమించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కమర్షియల్ బ్యాంకులు 7శాతం వడ్డీతో వ్యవసాయ రుణాలు ఇస్తుంటే సొసైటీలో 12శాతం వసూలు చేస్తున్నారని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వడ్డీ రేట్లు తగ్గించేలా చూస్తానని ఎమ్మెల్యే చెప్పారు. సమావేశం ప్రారంభంలో వార్షిక బడ్జెట్ ఆదాయ, వ్యయాలు వివరిస్తున్న క్రమంలో ఎమ్మెల్యే తనకు సమయం లేదని మాట్లాడి వెళ్లిపోవడంతో రైతులు కూడా వెళ్లిపోయారు. రైతుల కోసం జరిగే సమావేశంలో పాల్గొనేందుకు కూడా ఎమ్మెల్యేకు సమయం లేదా అని పలువురు రైతులు చర్చించుకోవడం కనిపించింది.