మక్కలు పండించిన రైతులు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్‌కు తీసుకొస్తే.. ప్రభుత్వం పెట్టిన సవాలక్ష కొర్రీలు.. కొనుగోళ్లలో తీవ్ర జాప్యంతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం పట్టించుకోకపోతే తమకు దిక్కెవ్వరంటూ దిగులు చెందుతున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ వ్యవసాయ మార్కెట్‌కు మక్కలు తేవద్దంటూ బుధవారం అధికారులు గేట్‌కు తాళం వేయడంతో ఆగ్రహించిన రైతులు ట్రాక్టర్లతో జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ వర్ధన్నపేట మండలం ఇల్లందు మార్కెట్ ఎదుట ధర్నా చేశారు. మండలానికి కనీసం నాలుగు చొప్పున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో రైతులు ఆందోళన చేపట్టారు.
నెక్కొండ, ఏప్రిల్ 15 : నెక్కొండ వ్యవసాయ మార్కెట్‌కు మక్కలు పోటెత్తడంతో మార్కెట్ యంత్రాంగం మార్కెట్ గేట్‌కు తాళాలు వేసి ట్రాక్టర్లు లోనికి రాకుండా అడ్డుకున్నది. దీంతో ఆగ్రహించిన రైతులు మక్కల ట్రాక్టర్లతో నెక్కొండ-నర్సంపేట ప్రధాన రహదారిని దిగ్బంధించి నిరసన వ్యక్తం చేసిన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండలో బుధవారం జరిగింది. నెక్కొండ వ్యవసాయ మార్కెట్లో మక్కలు అన్లోడ్ చేసే స్థలం లేదని, రైతులు మూడు రోజులపాటు మార్కెట్‌కు మక్కలు తీసుకురావద్దంటూ మక్కల కొనుగోళ్ల నిర్వాహకులు, సొసైటీ సీఈవో మోడెం సురేశ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మార్కెట్ చైర్మన్ రావుల హరీశ్‌రెడ్డి ఆదేశాల మేరకు మార్కెట్ సిబ్బంది మార్కెట్లోకి మక్కల వాహనాలు రాకుండా మంగళవారం రాత్రి గేట్లకు తాళం వేశారు.
బుధవారం ఉదయం మక్కలను మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతులు గేట్‌కు తాళాలు వేయడంతో ప్రభుత్వం, అధికార యంత్రాంగం తీరుపై మండిపడ్డారు. మక్కలను మార్కెట్‌కు తీసుకురాకుంటే ఎక్కడికి తీసుకెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్‌కు గేట్‌కు ఎదురుగా నెక్కొండ -ప్రధాన రహదారిపై ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి రోడ్డును దిగ్బంధించారు. మార్కెట్లోకి మక్కల ట్రాక్టర్లను వెళ్లనిచ్చేంత వరకు ఆందోళనను విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో నెక్కొండ-నర్సంపేట ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోడంతో ఎస్సై మహేందర్ ఘటస్థలానికి చేరుకొని పరిస్థితిని మార్కెట్ కార్యదర్శి కృష్ణమీనన్‌కు తెలిపారు. ఎస్సై చొరవతో మార్కెట్ గేట్‌కు వేసిన తాళాలను సిబ్బందితో తీయించారు. మార్కెట్ చైర్మన్ హరీశ్‌రెడ్డి మార్కెట్ గేట్‌కు తాళాలు వేయించారంటూ సీఈవో ఎస్సై మహేందర్, రైతులకు తెలిపారు. మార్కెట్లో బస్తాలు ఇవ్వరు, కాంటాలు కావు, కొనుగోలు చేసిన మక్కలను పంపిద్దామంటే లారీలు రావు..ఇదే పద్ధతని రైతులు ప్రభుత్వతీరుపై మండిపడ్డారు. పోలీసుల జోక్యంతో మార్కెట్ గేట్లు తెరువడంతో రోడ్డుపైనున్న మక్కల ట్రాక్టర్లు మార్కెట్లోకి వెళ్లాయి.

Warangal
జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో
వర్ధన్నపేట : మక్కల కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండడంతో రైతులు జాతీయ రహదారిపై బుధవారం రాస్తారోకో చేపట్టారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీంతో మండలానికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో మక్కలు అమ్మకానికి తీసుకొచ్చారు. కానీ, కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో రైతులు రోజుల తరబడి మార్కెట్లో వేచి ఉంటున్నారు. ఎండలు తీవ్రంగా ఉండడం.., యార్డులో కనీస వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఈ క్రమంలో మక్కల కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరినా అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తూ బుధవారం ఉదయం వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపైకి వచ్చి రాస్తారోకో చేపట్టారు. దీంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్సై సాయిబాబు వెంటనే సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని రాస్తారోకో చేస్తున్న రైతులతో మాట్లాడారు. అలాగే అధికారులు, నిర్వాహకులతో మాట్లాడి కాంటాలు వేగంగా జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులతో ఆందోళన విరమించారు.
ప్రభుత్వ ఆంక్షలపై అన్నదాత ఆగ్రహం
నల్లబెల్లి : మక్కల కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలపై రైతులు మండిపడుతున్నారు. తాము పండించిన మక్కలు చివరి గింజ వరకూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా మండల రైతు నాయకుడు చిట్యాల ఉపేందర్ మట్లాడుతూ.. ప్రభుత్వం మండలానికి ఒక్కటే మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించి, ఆంక్షల పేరుతో తీవ్ర ఇబ్బందిపెడుతున్నదన్నారు.
మక్కలను జల్లెడ పట్టాలంటూనే సంచుల కొరత, లారీలు అందుబాటులో లేవంటూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా మూడుచెక్కలపల్లె గ్రామంలో 20 ఎకరాల్లో కల్లాల వద్ద ఆరబోసిన మక్కలు కాలిబూడిదయ్యాయన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అన్ని మండలాల్లో కనీసం 4 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి త్వరగా మక్కల కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రైతులు చిన్నుపేందర్రెడ్డి, ఒల్లె మల్లయ్య, చెంచు మహిపాల్, మేద నర్సయ్య, కదురు మోహన్, కవిత, కల్పన, రాజేంద్ర, కమలమ్మ, పద్మ పాల్గొన్నారు.