వచ్చీపోయే కరెంట్‌తో అన్నదాతలు అరిగోస పడుతున్నరు. రోజుకు ఐదారు సార్లు పోవడం.. లో వోల్టేజీతో స్టార్టర్లు, మోటర్లు కాలుడు.. డీపీలు పేలిపోవడం సర్వసాధారణమైంది. ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల దాకా కరెంట్ ఇస్తున్న పేరే కాని పొలాల దగ్గర త్రీఫేస్ లేక నానా ఇబ్బందులకు గురవుతున్నరు. కాలిపోయిన స్టార్టర్లు, మోటర్లను తొర్రూరుకు తీసుకువచ్చి బాగు చేయించి పెట్టిన రెండు రోజులకే కరెంట్‌తో మళ్ల ఆగం అవుతున్నరు. ఏం బాగు చేసినవని మెకానిక్‌ను అడిగితే కరెంట్ సక్కగ లేకపోతే మేమేం చేయాలని చేతులెత్తేస్తున్నరు. ఒక తొర్రూరుకే రోజుకు 20 మోటర్లు, స్టార్టర్లు రిపేర్ కోసం పట్టుకొస్తున్నరు. ఈ మాయదారి కరెంట్ ఎప్పుడు సక్కగైతదో.. మా గోస ఎప్పుడు తీరుతదో అంటూ రైతులు తలలు పట్టుకుంటున్నారు.
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రోజు ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నాణ్యత లేకుండా సరఫరా జరుగుతోంది. కనీసం ఐదారు సార్లు అంతరాయం తలెత్తడం, లో, హైవోల్టేజీతో ట్రాన్స్ఫార్మర్లపై భారం పడి డీపీలు పేలిపోయి మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు తరచూ కాలుతున్నాయని రైతులు చెబుతున్నారు. తొర్రూరులో ఏడు చోట్ల మోటర్లు, స్టార్టర్లు మరమ్మతు చేసే షాపులుంటే వీటికి రోజుకు 20 వరకు వస్తున్నాయని చెబుతున్నారు. ఎనిమిదేళ్ల క్రితం నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని, వర్షాలు పడకపోతే రైతులు ఇంకా నష్టపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఒక స్టార్టర్ కాలితే రూ.500 నుంచి రూ.1500 వరకు, మోటర్‌కు అయితే రూ.3వేల నుంచి రూ.6వేల వరకు ఖర్చవుతున్నదని, రవాణా భారం అదనమని రైతులు ఆవేదనతో చెబుతున్నారు. కాలిన మోటర్ లేదా స్టార్టర్ బాగు చేయించుకోవడానికి కనీసం మూడు రోజుల పాటు నిరీక్షిస్తున్నారు. కొన్నిచోట్ల త్రీఫేస్ కరెంట్ కోసం రైతులు విద్యుత్ అధికారులను ఆశ్రయిస్తే తిరిగి వారే తమ గోడును రైతులకు వెల్లబోసుకునే పరిస్థితులు దాపురించాయని చెబుతున్నారు.
గతంతో పోలిస్తే ఈ ఏడాది కాలిపోతున్న మోటర్లు, స్టార్టర్ల సంఖ్య బాగా పెరిగింది. బాగు చేసి రైతుకు అప్పజెప్పిన తర్వాత మళ్ల నాలుగు రోజులకే మోటరు, స్టార్టర్ కాలిపోయిందని, ఏం పని చేశావని నిలదీస్తున్నరు. కరెంట్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో ఈ సమస్య వస్తోంది. చేసేదేమీ లేక, రైతు బాధ చూడలేక నష్టమైనా మళ్లీ బాగు చేసి ఇస్తున్నం. షాపులో ఈ పనులు తెలిసిన వర్కర్లు లేక రిపేర్ చేసి ఇవ్వడం ఇబ్బందిగా మారింది.
వర్షాల కారణంగా రాత్రివేళ త్రీఫేస్ సరఫరాలో అవాంతరాలు తలెత్తితే సింగిల్‌ఫేస్ ఇస్తున్నాం. కొన్నిచోట్ల అప్ అండ్ డౌన్ కారణంగా మోటర్లు, స్టార్టర్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్లపై డీపీలు పేలి రైతులు ఇబ్బందులు పడితే వెంటనే సమాచారం ఇవ్వాలి. సీఎం డీ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం విద్యు త్ ప్రజావాణి కూడా నిర్వహిస్తున్నందున ఓవోల్టేజీ సమస్యలు తలెత్తే ట్రాన్స్ఫార్మర్ల వివరాలను ఫిర్యాదుల రూపంలో రైతులు అందజేయవచ్చు. వ్యవసాయానికి, గృహావసరాలకు అంతరాయం లేకుండా సరఫరా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ బ్రేక్ డౌన్ జరిగినా వెనువెంటనే సమస్యను పరిష్కరించి పునరుద్ధరిస్తున్నాం.
మా పొలం దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ డీపీలు ఒక్కసారి పేలడంతో మా మోటర్ కాలిపోయింది. రిపేర్ కోసం తొర్రూరుకు తీసుకువస్తే రూ. 6 వేలు ఖర్చయింది. రోజుకు ఐదారు సార్లు కరెంట్ ట్రిప్ అవుతుండడంతో ఇబ్బంది పడుతున్నం. పేలిన ట్రాన్స్ఫార్మర్లు బాగు చేయించి పెట్టాలంటే రోజుల కొద్దీ ఎదురు చూడాల్సిందే. కరెంట్ కూడా సక్రమంగా రావడం లేదు.
మాకు త్రీఫేస్ కరెంట్ కావాలని ఆఫీసర్ల చుట్టూ తిరిగినా పని కావడం లేదు. సింగిల్ ఫేస్ కరెంట్‌తో మోటర్లపై భారం పడి కాలిపోతున్నయి. వారంలో నా స్టార్టర్ రెండు సార్ల కాలితే పట్టుకొచ్చిన. ఇప్పటికే రెండు వేల పైన ఖర్చయింది. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ కష్టాలైతే లేవు.