నర్సింహులపేట మే 11 : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి ధర వస్తుందన్న ఆశతో కొనుగోలు కేంద్రానికి తరలిస్తే పట్టించుకునే వారు లేక పశువుల పాలు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సింహులపేట మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రం వద్ద కాపలాదారులు ఉన్నప్పటికీ సిబ్బంది పట్టింపు లేని తనంతో ఆరబెట్టిన ధాన్యం పశువుల పాలవుతున్నది. ఇప్పటికే కాంటాలు కాక, లారీలు లేక అకాల వర్షాలతో తేమశాతం తక్కువ వచ్చినప్పటికీ తడిసి పోవడంతో మళ్లీ ఆరబెట్టాల్సిన పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే ముందు వచ్చిన వాళ్ళవి కాంటాలు పెట్టకుండా వెనక్కి వచ్చిన వారి ధాన్యం కాంటాలు పెడుతూ చిన్న రైతులను ఇబ్బందులు గురిచేస్తున్నారని రైతులు వాపోయారు. ఇప్పటివరకు బోనస్ డబ్బులు రావడంలేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించి, బోన్స్ డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.