రైతులకు యూరియా కష్టాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఆదివారం మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి, కేసముద్రం, నెల్లికుదురుతో పాటు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఎరువుల కోసం ఎదురుచూపులు తప్పలేదు. పలుచోట్ల క్యూ కట్టిన రైతుల్లో సగం మందికి కూడా బస్తాలు దొరకక నిరాశతో వెనుదిరిగారు. అందరికీ సరిపడా ఎరువులు అందుబాటులో లేక సొసైటీలు చేతులెత్తేయడంతో అన్నదాతలు ఆగ్రహంతో రోడ్డెక్కి ఆందోళనకు దిగారు.
– నెల్లికుదురు/కేసముద్రం/ఇనుగుర్తి/తాడ్వాయి, ఆగస్టు 17
ఆరుగాలం కష్టించే రైతులకు సాగులో కావాల్సిన యూరియాను ప్రభు త్వం సరఫరా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి, మక్కజొన్న, పత్తి పంటలు సాగు చేసి రోజులు గడుస్తున్నా నేటికీ యూరియా ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేసముద్రం మండలంలోని కేసముద్రం, ధన్నసరి సొసైటీలకు యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు స్థానిక రైతువేదికకు చేరుకొని ఉదయం నుంచే బారులు తీరారు. అయితే 400 బస్తాలకు వెయ్యి మందికి పైగా రైతులు క్యూలో ఉన్నారు. పోలీసుల సమక్షంలో క్యూ పద్ధతిలో వ్యవసాయ అధికారులు టోకెన్లు ఇవ్వగా రైతులు ఆయా సొసైటీలకు వెళ్లగా ఒకరికి ఒక బస్తా మాత్రమే ఇచ్చారు. టోకెన్లు అందక మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగారు.
సరిపడా యూరియా కోసం రాస్తారోకో
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలకేంద్రంలోని సహకార సంఘానికి ఆదివారం ఉదయం 200 బస్తాల యూరియా వచ్చింది. సమాచారం తెలుసుకొని రైతులు ఆధార్ కార్డు జిరాక్స్‌లతో ఉదయం నుంచే రైతు వేదిక వద్ద బారులు తీరారు. అయితే బస్తాల కన్నా రైతుల సంఖ్య ఎక్కువ ఉండడంతో అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కోపోద్రిక్తులైన రైతులు తమకు యూరియా బస్తాలు కావాలంటూ రాస్తారోకో చేశారు. ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు సముదాయించారు. కేసీఆర్ హయాంలో తమకు యూరియా కొరత లేదని చెప్పిన రైతులు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడినుంచి వెనుదిరిగారు.
బీఆర్ఎస్ పాలనలో అదునుకు ఎరువులు
అందరికీ యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తొర్రూరు ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. రాకపోకలకు అంతరాయం కలగడంతో ఎస్సై మురళీధర్‌రాజ్, ఏవో వెంకన్న వచ్చి రైతులను శాంతింపజేశారు. ఇక్కడ మాజీ జడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు సరిపడా ఎరువులు, నాణ్యమైన విత్తనాలతో పాటు వానాకాలం, యాసంగిలో సాగుకు ముందే రైతుబంధు నగదు ఖాతాల్లో వేసినట్లు గుర్తుచేశారు.
రుణమాఫీ, రైతుబీమా అందించి రైతు కుటుంబాలను ఆదుకున్నామని తెలిపారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని రుణమాఫీ, రైతు భరోసాతో నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నీలం దుర్గేశ్, కముటం శ్రీనివాస్, కొండ్రెడ్డి రవీందర్‌రెడ్డి, మోడెం రవీందర్‌గౌడ్, గుగులోత్ వీరునాయక్, ఘనపారపు రమేశ్, రడం శ్రీను, ఏదునూరి శ్రీనివాస్, ఎన్నమల ప్రభాకర్ ఉన్నారు.
లైన్లో నిలబడ్డా యూరియా దొరుకుతలేదు..
మొగుళ్లపల్లి, ఆగష్టు17 : రైతుకు అవసరం లేకున్నా అనవసరంగా ఎరువులు, పురుగు మందులను అంటగడుతున్నరు. ఆ పైసలతో ఇంకో యూరియా బస్తా కొనుక్కోవచ్చు. సొసైటీ నిర్వాహకులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నరు. చేసేదేం లేక వారు చెప్పినట్టు కొంటున్నం. గతంలో కావాల్సినన్ని యూరి యా బస్తాలను తీసుకెళ్లెటోళ్లం. ఇప్పుడు కుటుంబం మొత్తం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. తెల్లవారక ముందే లైన్లో ఉండాల్సి వస్తున్నది. రైతులకు సరిపోను యూరియాను ప్రభుత్వం ఇస్తలేదు. కొద్ది రోజుల నుంచి రైతులంతా యూరియా కోసం పడిగాపులు పడుతుండడంతో ఓ వైపు వ్యవసాయ పనులు ఆగుతుండగా, మరోవైపు పంటలు దెబ్బతింటున్నయి.
-కోరెల తిరుపతి, గుండ్లకర్తి గ్రామం, మొగుళ్లపల్లి మండలం
600కు ఇచ్చింది 222 మందికే..
నెల్లికుదురు మండల శ్రీరామగిరి సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున 5 నుంచి సాయంత్రం 4గంటల వరకు సుమారు 600మంది వేచి చూశారు. అయితే 222 బస్తాలు మాత్రమే రావడంతో ఒక్కో బస్తా మాత్రమే పంపిణీ చేశారు. మిగిలిన 378 మంది రైతులకు యూరియా లభించకపోవడంతో నిరాశతో వెనుదిరిగిపోయారు.
యూరియా కోసం అరిగోస పడుతున్నం..
చిట్యాల, ఆగస్టు 17 : చేతికి అందే పంట కోసం యూరియా దొరకక తిప్పలైతుంది. ప్రభు త్వం ఏమో ఒకరికి రెండు బస్తాల ఇవ్వాలని నిబంధన పెట్టింది. నాకున్న నాలుగు ఎకరాలకు ఎన్ని రోజులు లైన్లో నిలబడినా సరిపడా యూరియా దొరకడం లేదు. సొసైటీలో పైసలు లేక ప్రభుత్వం యూరియాను పంపియలేదంట. దుకాణదారుల దగ్గరకు పోయి బతిమిలాడి కొనుకోవాల్సి వస్తున్నది. వడిగాపులు గాసి కాళ్లకు నొప్పులు వస్తున్నయి. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా రైతులకు అవసరమైన యూరియా అందించాలి.
– కన్నవేణి రాజయ్య, చిట్యాల, జయశంకర్ జిల్లా
కాలం కాలేగాని.. ఐతే ఆగమవుదుం..
దేవరుప్పుల, ఆగస్టు 17 : ఎప్పుడో ఎనుకటొచ్చిన యూరియా కరువు ఇప్పుడొచ్చింది. మనదగ్గర కాలంకాక కరువుతాండవిస్తున్నది. కాలం ఐతె యూరియా దొరకక ఆగమవుదుం. జనగామ జిల్లా రెడలర్టని టీవీలల్ల చెపుతున్నరు. అతిభారీ వర్షాలంటుండ్రు.. బళ్లు బంద్పెడుతున్నరు. చినుకు పడ్డదిలేదు, చెరువునిండింది లేదు. కాలంకాక, నీళ్లులేక నార్లు ముదిరినయ్. ఎట్టకేలకు పైన వానబడి వాగు పారుతాంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు యూరియా పుష్కలంగా దొరికింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో యూరియా కరువు వచ్చింది. పది బస్తాలు అవసరమైన కాడ రెండు బస్తాలు ఇస్తుండ్రు. కాలం బిర్రుగైతె యూరియా కోసం కొట్టుకుందురు. యూరియానే కాదు.. కాంప్లెక్స్ ఎరువులు కూడా దొరుకుతలేవు.
– చెన్నూరు సత్యనారాయణ, ఆదర్శరైతు, కడవెండి
ఎరువుల దుకాణాల్లో స్టాక్ లేదంటున్నరు..
దంతాలపల్లి, ఆగస్టు 17 : మండలంలో యూరి యా కొరత రైతులను వేధిస్తున్నది. ఎరువుల దుకాణాల్లో అడిగితే స్టాక్ లేదు.. పైనుంచి వస్తలేదని వ్యా పారులు చెబుతున్నరు. కొన్ని దుకాణాల్లో యూరి యా తీసుకుంటే మరో ఎరువు తీసుకోవాలంటూ లింకు పెడుతున్నరు. దీంతో యూరియా కొనాలంటే రూ.800 అదనపు భారం పడుతున్నది. సకాలంలో యూరియా రాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నరు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సొసైటీ గోదాముల వద్ద పడిగాపులు కాసినా యూరియా దొరుకుతలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు మేలు జరుగుతుందని చెప్పిన వాళ్లకు ఇప్పుడు యూరియా కోసం రైతులు గోసపడుతున్న తీరు చూస్తే అర్థమైతది.
-సుధాకర్‌రెడ్డి, రైతు, గున్నేపల్లి, దంతాలపల్లి మండలం
మళ్లీ లారీ లోడ్ వచ్చేదెప్పుడో?
సరిపడా యూరియా ఇవ్వడం లేదని తాడ్వాయి మండలం కాల్వపల్లిలోని ఆగ్రోస్ సేవా కేంద్రం ఎదుట రైతులు ఆదివారం నిరసన తెలిపారు. ప్రతి రైతుకు ఒకటీ రెండు బస్తాలే ఇస్తుండడంతో యూరియా సరిపోవడం లేదంటూ రైతు సేవా కేంద్రం ఎదుట ఆందోళన. వారం రోజుల నుంచి యూరియా కోసం తిరుగుతున్నా రేపుమాపు అంటున్నారని యూరియా మాత్రం ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు. అయితే సిబ్బంది కార్యాలయం తెరువకపోవడంతో రైతులు ఆందోళన దిగారు. అదే సమయంలో యూరియా లారీ వచ్చినప్పటికీ ఒకటీ రెండు బస్తాలు ఇచ్చారని.. మళ్లీ ఎన్ని రోజులకు యూరియా వస్తుందోనంటూ నిరాశతో రైతులు వెనుదిరిగారు.
సరిపడా స్టాక్ లేదని తిప్పుతున్నరు..
మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 17 : ప్రతి రోజూ సొసైటీ చుట్టూ తిరుగుతున్నా యూరియా బస్తా దొరకడం లేదు. ఇవాళ తెల్లవారుజామునే యూరియా ఇస్తారని వస్తే తాళం వేసి ఉంది. వారం రోజులుగా యూరియా కోసం అరిగోస పడుతున్నం. మొదట టోకెన్ అంటరు.. తర్వాత ఆధార్ కార్డు కావాలని చెప్పి వారికి ఇష్టమైన వారికే యూరియా ఇస్తున్నరు. ఆధార్ కార్డు మీద ఒక్క బస్తానే ఇస్తామంటే మా కుటుంబం నుంచి ముగ్గురు వచ్చి లైన్లో నిలబడినా యూరియా దొరకడం లేదు. సరిపడ స్టాక్ లేదని తిప్పి పంపుతున్నరు. గతంలో యూరియాకు ఇంత ఇబ్బంది పడలే. ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంతగా బాధపడుతున్నం. ప్రభుత్వం కొంత మందికి మాత్రమే యూరియాను అందించి బ్లాక్ చేస్తున్నది. అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియాను ఇవ్వాలి.
-తేజవత్ వెంకన్న, రైతు, ముడుపుగల్