పాలకుర్తి రూరల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులు సంఘటితంగా ఉద్యమించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య అన్నారు. శుక్రవారం పాలకుర్తి మండల కేంద్రంలో రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుండి 2 లక్షల వరకు రైతు పంట రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ చేసి తిరిగి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కొత్త రుణాలు ఇవ్వాలన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నాటి నుండి పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా నిధులను తక్షణమే విడుదల చేసి 2025- 26 వానాకాలం రైతు భరోసా నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భూ సదస్సులో సదా బైనమా దరఖాస్తులు తీసుకొని ఫీల్డ్ సర్వే నిర్వహించి రైతులందరికీ పట్టా పాస్ బుక్కులు జారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చిట్యాల సోమన్న, రైతు సంఘం మండల కన్వీనర్ బెల్లి సంపత్, ముస్కు ఇంద్రారెడ్డి, మాసంపల్లి నాగయ్య, కౌడ గాని మల్లేష్, బెల్లి యాకన్న, గణపురం సునీల్, జి ఎల్లయ్య, పరశురాములు, దారావతు రవి తదితరులు పాల్గొన్నారు.