బయ్యారం ఏప్రిల్ 20 : మోదీ సర్కార్ వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తూ కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నదని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే యం) ఇచ్చిన పిలుపులో భాగంగా బయ్యారం మండల కేంద్రంలో వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడే వాన్స్ భారత పర్యటనను నిరసిస్తూ వాన్స్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక చట్టాలను దొడ్డి దారిన అమలు చేయాలని ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్న క్రమంలోనే జె డే వాన్స్‌ను భారతదేశానికి ఆహ్వానించడం సిగ్గుచేటన్నారు.
ఇప్పటికైనా మోదీ సర్కార్ జేడే వాన్స్‌తో చేసుకోబోయే ఒప్పందాలను, భారత్ పర్యటనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వ్యవసాయ రంగాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మండ రాజన్న, టి.యు.సి.ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బిళ్లకంటి సూర్యం రామగిరి బిక్షం, నంబూరి మధు. వీరబోయిన ఐలయ్య, మంకెన తిరుపతిరావు, అంగిరేకుల నాగేశ్వరరావు, నరాల ఐలయ్య వల్లాల బిక్షం, యుగంధర్,కే నాగేశ్వరరావు, ఉడుగుల ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.