భూపాలపల్లి రూరల్, జూన్ 15 : గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కోసం తమ భూములు ఇచ్చేది లేదని టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల రైతులు భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రాకు తెగేసి చెప్పారు. పంట భూములే తమకు జీవనాధారమని, తమను ఇబ్బంది పెట్టొద్దని అన్నారు. శనివారం ఆయా మండలాల రైతులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనే ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. అంతకు ముందు రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్ట పరిహారం అందజేస్తామని తెలిపారు. అభివృద్ధికి రహదారుల ఏర్పాటు అత్యంత అవసరమని, భూ సేకరణ విషయంలో రైతుల సూచనలు, సలహాలు తీసుకొని నివేదికలు పంపినట్లు తెలిపారు. 350 ఎకరాలు, 35 కిలో మీటర్ల దూరం వరకు గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే వస్తుందని, రోడ్డు నిర్మాణం కోసం 45 మీటర్ల వెడల్పుతో భూ సేకరణ చేయాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా రైతులు తమ భూములను ఇవ్వబోమని చెప్పడంతో పాటు నిరసన తెలపడంతో కలెక్టర్ సమావేశం నుంచి వెళ్లిపోయారు. అనంతరం భూపాలపల్లి-పరకాల రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రధాని మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జాతీయ రహదారి నిర్మాణానికి భూములు ఇచ్చేది లేదని ముక్త కంఠంతో రైతులు తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మంగీలాల్, నేషనల్ హైవే అధికారులు, మూడు మండలాల రైతులు పాల్గొన్నారు.