కాటారం, మే 25 : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనడం లేదని అన్నదాతలు రోడ్డెక్కారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని మార్కెట్ సమీప మంథని ప్రధాన రహదారిపై ధాన్యం బస్తాలతో రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధాన్యం బస్తాలను తగులబెట్టారు. పురుగు మందు డబ్బాలతో సుమారు 2 గంటలపాటు ఎండలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాటారానికి చెందిన పలువురు రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తే నెల రోజులుగా కొనకుండా లారీలు, గన్నీ సంచులు లేవనే సాకుతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమ సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
ధాన్యం కొనకపోవడంతో రోజుల తరబడి కొనుగోలు కేం ద్రాల వద్దే పడిగాపులు పడుతున్నామని, పశువుల నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఇబ్బంది పడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే తీవ్రం గా నష్టపోతామన్నారు. తరు గు తీయకుండా వెంటనే ధా న్యం కొనుగోలు చేయాలని, లేకపోతే వెంట తెచ్చుకున్న పు రుగు మందు తాగి ఆత్మహత్య కు పాల్పడతామని హెచ్చరించారు. కలెక్టర్ వచ్చేంత వరకు ధర్నా విరమించేది లేదని రైతులు ఎండలో భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. పీఏసీఎస్ సీఈవో సతీశ్, ఎస్సై శ్రీనివాస్ రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. త్వరగా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.