శాయంపేట/మొగుళ్లపల్లి, జూలై 19: కాంగ్రెస్ పాలనలో యూరి యా కొరత ఏర్పడి రైతులు ఆందోళన బాటపట్టారు. ఇదే సమస్యపై కొద్ది రోజులుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల నిరసన తెలిపిన కర్షకులు శనివారం హనుమకొండ జిల్లా శాయంపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో పెద్ద ఎత్తున ధర్నా లు నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. శాయంపేట మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో మార్కెట్ గోదాములో యూరియాను నిల్వ చేసి పంపిణీ చేస్తున్న క్రమంలో రైతులు శనివారం ఉదయం గోదాము వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
వీరి నుంచి ఆధార్, పట్టాదారు పాస్బుక్ జిరాక్సులను సొసైటీ సిబ్బంది తీసుకున్నారు. అయితే అప్పటికే వారి వద్ద ఇలాంటి పత్రాలు ఉండడంతో రైతు లు అవాక్కయ్యారు. అనంతరం మళ్లీ ఆధార్, పాస్బుక్ జిరాక్సు కాపీలను తీసుకోవడంతో మండిపడ్డారు. అసలు ఎవరికి యూరియా బస్తాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదాములో యూరియా తక్కువ ఉండడంతో మండిపడ్డారు. దీనికి నిరసనగా గోదాము పక్కనే ఉన్న పత్తిపాక-శాయంపేట రోడ్డుపై ఎత్తున ఆందోళన నిర్వహించారు. వెయ్యి బస్తాల యూరియా తెల్లారేసరికి 50 బస్తాలకు ఎందుకు తగ్గిందని, ఎవరికి అమ్ముకున్నారో చెప్పాలని నిలదీశారు.
మేము రైతులం కాదా? మాకు యూరియా ఎందుకు ఇవ్వరని మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు విచారణ జరిపించి రైతులందరికీ యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు మొగుళ్లపల్లిలోని పీఏసీఎస్ ఆవరణలో యూరియా బస్తాల కోసం తెల్లవారు జామునే 5 గంటలకు రైతులు వచ్చారు. చెప్పులను క్యూలో పెట్టి నిరీక్షించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో పడిగాపులు కాశారు. వర్షాకాలం ప్రారంభమైనా సరిపడా యూరియా ప్రభుత్వం అం దించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించారు. వెంటనే సరిపడా యూరియాను అం దించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.