జయశంకర్ భూపాలపల్లి, మే 21 (నమస్తే తెలంగాణ) : రోహిణి కార్తె వచ్చిందంటే రైతులు విత్తనాలు కొనుగోలు చేయడం ప్రారంభిస్తారు. ఇదే అదునుగా నాసిరకం విత్తనాలను అంటగట్టేందుకు కొందరు విత్తన విక్రయ దళారులు గ్రామాల్లోకి వెళ్లి రైతులను నమ్మిస్తూ వారికి అంటగడుతున్నారు. తీరా విత్తనం వేసిన తర్వాత మొలకెత్తవు. అప్పుడుగానీ అవి నాసిరకమని తెలియక మోసపోవడం రైతు వంతవుతుంది. ఇలాంటి ఇబ్బందులు రాకుండా వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తే మేలు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలను కట్టడి చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇందుకుగాను వ్యవసాయ, పోలీస్ తదితర శాఖలను సమన్వయం చేస్తూ నకిలీ కట్టడికి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది. కఠిన నిబంధనలు కూడా తీసుకొచ్చింది. అయినప్పటికీ కొన్నిచోట్ల రైతులను దళారులు మోసం చేస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
రైతులు విత్తన కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలి. గ్రామా ల్లోకి వచ్చిన వారి వద్ద నుంచి ఎట్టి పరిస్థితుల్లో విత్తనాలు కొనుగోలు చేయొద్దు. వ్యవసాయ శాఖ సూచనలను పాటించి విత్తనాలను కొనుగోలు చేసుకోవాలి. నకిలీవి కొని మోసపోవద్దు. ఈ సీజన్లో పత్తి విత్తనాలు పొడి దుక్కుల్లో వేసి వృథా చేయొద్దు. వరి వేసుకునే రైతులు అన్ని రకాల వరి విత్తనాలను వెదజల్లే, డ్రమ్సీడర్ పద్ధతిని అవలంబించాలి. ముఖ్యంగా ఎంటీయూ-1001 రకం వరి ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయడం లేదు. ఈ రకం విత్తనాన్ని రైతులు వేయకపోవడం మంచిది. గ్రామాల్లో విడిగా విత్తనాలు అమ్మేందుకు వచ్చిన వారి సమాచారం ఇవ్వాలి. అలాగే విత్తన షాపుల యజమానులు నిబంధనలు పాటించకుండా విత్తనాలు విక్రయిస్తే వ్యవసా యాధికారులకు రైతులు ఫిర్యాదు చేయాలి.
– విజయభాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి, భూపాలపల్లి