నల్లబెల్లి/ నెక్కొండ, ఏప్రిల్ 19 : మక్క జొన్నలు కొనుగోలు చేయడంలేదని నిరసిస్తూ రైతులు ఆందోళనలకు దిగారు. కొనుగో లు కేంద్రాల నిర్వాహకులు, మా ర్క్‌ఫెడ్ సంస్థ నిర్లక్ష్యంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామ ని రోడ్డెక్కారు. అధికారం యం త్రాంగం ముప్పతిప్పలు పెడుతోందని, తక్షణం బస్తాలిచ్చి కొనుగోళ్లను వేగవం తం చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్ జిల్లా నెక్కొండ వ్యవసాయ మార్కెట్‌కు ఎదురుగా నెక్కొండ -నర్సంపేట ప్రధాన రహదారిపై, నల్లబెల్లి మండలం గుండ్లపహడ్ గ్రామం వద్ద జాతీయ రహదారిని దిగ్భందించారు. గన్నీ బస్తాలు ఇవ్వాలని, కొనుగోళ్లను వేగవంతం చేసేదాక ఆందోళనను విరమంచేది లేదంటూ రైతన్నలు ఆందోళన చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది.
నెక్కొండలో ఎస్సై మహేందర్ రైతులను శాంతింపచేసేందుకు శతవిధాల యత్నించారు. ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరించి సమస్యలను పరిష్కరించేందుకు పాటుపడుతానన్నారు. మూడు వారాలుగా రైతులు అవస్థలు పడుతున్నారని, గన్నీ బస్తాలు తక్షణం కావాలని, పరిస్థితి రోజురోజుకూ క్లిష్టంగా మారుతన్నదని డీసీవోకు ఎస్సై పరిస్థితిని వివరించారు. ప్రస్తుతం మార్కెట్లో 5వేల గన్నీ బస్తాలున్నాయని, మధ్యాహ్నం వరకు మరో పదివేల బస్తాలు అందించే ఏర్పాటు చేస్తానని డీసీవో హామీ ఇచ్చారు. మధ్నాహ్నం వరకు పదివేల బస్తాలు వస్తాయని ఎస్సై హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. నల్లబెల్లి మండలం గుండ్లపహడ్ ధర్నాలో రైతు బొద్దిరెడ్డి ప్రతాప్‌రెడ్డి తోపాటు రైతులు మాట్లాడారు.
కష్టపడి పండించిన పంటను అమ్ముకొనేందుకు రైతులు మండుటెండల్లో మలమల మాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పట్టింపులేని తనంతో మక్క రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. సమస్య పరిస్కారం కోసం కృషి చేయాల్సిన జిల్లా కలెక్టర్ కనికరం చూపడం లేదంటూ ఆవేదన వ్వక్తం చేస్తున్నారు. మక్క రైతులకు తీపి కబురంటూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం గన్నీ బ్యాగులు సరఫరా చేయకపోవడంతో కేంద్రాల నిర్వాహకులు చేతులెత్తేశారన్నారు. అంతేగాక రైతులే గన్నీ బ్యాగులు, వాహనాల కిరాయి ఖర్చులు భరించి గోదాములకు మక్కలు తరలిస్తే మార్క్‌ఫెడ్ అధికారులు దిగుమతి చేసుకుంటారని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు సూచిస్తున్నారని చెప్పారు.
కాగా, ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తేనే గన్నీ బ్యాగులు, వాహనాల కిరాయిలు ఇస్తామని చెప్తున్నారన్నారు. అయినా తాము గన్నీ బ్యాగులు కొనుగోలు చేసి టన్నుకు రూ.500 కిరాయి బరించి గో దాములకు మక్కలు తరలిస్తే అక్కడ దిగుమతి చేసుకునేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లాల వద్ద పది రోజులు, కొనుగోలు కేంద్రాల వద్ద మరో పది రోజులు, దిగుమతి కోసం గోదాముల వద్ద మూడు రోజులుగా నిరీక్షించాల్సి వస్తున్నదని, గోదాము ఆవరణతో పాటు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో సందర్భంగా హైవేపై గంట పాటు వాహనాలు నిలిసిపోయాయి.