దంతాలపల్లి : కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే కొనే నాథుడు లేక కళ్లాల్లోని ధాన్యం నీటి పాలవుతున్నది. దంతాలపల్లి మండలంలోని కుమ్మరి కుంట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెలరోజుల క్రితం వచ్చిన ధాన్యాన్ని కూడా కాంటాలు పెట్టడం లేదని రైతులు ఆరోపించారు. అలాగే కాంటాలు పెట్టిన ధాన్యం బస్తాలు మిల్లులకో తరలించక పోవడంతో అకాల వర్షాలకు బస్తాలు తడిసి మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అధికారులు పట్టించుకోకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ సూర్యాపేట -దంతాలపల్లి రహదారిపై వడ్ల బస్తాలు వేసి రైతులు ఆందోళన చేశారు. పోలీసులు ఆందోళన అడ్డుకోవాలని చూడగా రైతు యాకూబ్ కానిస్టేబుల్ కాళ్లు మొక్కి మా బాధను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.