ఖిలావరంగల్, అక్టోబర్ 25 : యాసంగి ధాన్యం బోనస్ తక్షణమే చెల్లించాలని, మార్కెట్ దోపిడీని అరికట్టాలని కోరుతూ అఖిల భారత రైతు సమాఖ్య(ఏఐకేఎఫ్) ఆధ్వర్యంలో శనివారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్ల కార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేశ్ మాట్లాడుతూ నాలుగు నెలలు దాటినా రూ.1168 కోట్లు రైతులకు బోనస్ డబ్బులు చెల్లించకపోవడం ఎంత వరకు సమంజసమన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం సకాలంలో జీతాలు, అలవెన్స్లు తీసుకుంటూ అన్నం పెట్టే అన్న దాతలకు మాత్రం రావాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు.
రైతులకు డబ్బులు చెల్లించకుంటే మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. మక్కజొన్న రైతులు ఇప్పటికే క్వింటాకు రూ.500 నుంచి రూ.600 మద్దతు ధర నష్టపోయారని, అలాగే పత్తి దిగుబడి తగ్గి పండిన కొద్దిపాటి పంటను వ్యాపారులు, దళారులు క్వింటాకు రూ.6 వేలకు మించి కొనడం లేదన్నారు. సీసీఐ, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో రైతు సంఘం జిల్లా కోశాధికారి సింగతి మల్లికార్జున్, సహాయ కార్యదర్శి గోనె రాంచందర్, నాయకులు నర్ర ప్రతాప్, వంగల రాగసుధ, మాలోత్ సాగర్, సుంచు జగదీశ్వర్, ముక్కెర రామస్వామి, గుగులోత్ అరుణ్నాయక్, ఐతం నగేశ్, శివ, కుమారస్వామి, సురేందర్, యాదగిరి, రాజు, దాసు తదితరులు పాల్గొన్నారు.