జనగామ, జూలై 12 (నమస్తే తెలంగాణ)/ జనగామ రూరల్ : ‘పంటలు ఎండిపోతున్నయ్.. ప్రభుత్వం సాగునీరందించి ఆదుకోవాలి’ అని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. పంటలకు దేవాదుల నీటి విడుదలలో నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. శనివారం జనగామ-సిద్దిపేట రాష్ట్ర ప్రధాన రహదారిపై శామీర్‌పేట కాళోజీ సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి గంటపాటు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి జనగామ మండలానికి దేవాదుల నీటిని వెంటనే విడుదల చేయాలన్నారు. రైతుల ఆందోళనతో గంటపాటు ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది.
‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా రైతులను పట్టించుకున్న నాథుడే లేడు.. సీఎం రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేదిలేదని భీష్మించుకొని కూర్చున్నారు. కేవలం వర్షాలు, దేవాదుల నీటిపై ఆధారపడి మాత్రమే పంటలు సాగు చేస్తున్న జనగామ ప్రాంతంలో ప్రస్తుత సీజన్లో వానలు పడక పంటలు ఎండుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలపై ఆధారపడి వేసుకున్న పంటలు ఎండిపోతుంటే దేవాదుల నీటిని విడుదల చేయాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కపెడుతున్నారని మండిపడ్డారు.
దేవాదుల ప్రాజెక్టులో భాగంగా గండిరామారం, బొమ్మకూరు, కన్నెబోయినగూడెం, వెల్దండ, లద్నూర్, తపాస్‌పల్లి రిజర్వాయర్ల నుంచి జనగామ నియోజకవర్గంలోని ఆయకట్టుకు సాగునీరివ్వాలని డిమాండ్ చేశారు. సీజన్ ప్రారంభమై నాట్లు ముగింపు దశకు చేరుకొని రైతులు సాగునీటి కోసం తండ్లాడుతుంటే అధికారులు, ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్లలో నీళ్లున్నా విడుదల చేయడంలో అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, గతేడాది కూడా ఇదే నిర్లక్ష్యంతో వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయామన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతున్నదని, పంటలు కాపాడుకునేందుకు తాము గేట్లు ఎత్తుతామంటే కేసులు పెడతామని అధికారులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నీటిని విడుదల చేయకుంటే బొమ్మకూరు రిజర్వాయర్ గేట్లను తామే ఎత్తుతామని రైతులు హెచ్చరించారు.
రోహిణిలో పోసిన నారు ఎండిపోయింది
జనగామ రూరల్ : నాకున్న 8 ఎకరాల్లో కాలంతో పాటు కాల్వల ద్వారా నీరందితే నాటు పెట్టేందుకు రోహిణి కార్తెలో 3 బస్తాల నారు పోసిన. కాలం కలిసిరాక, గోదావరి జలాలు విడుదల చేయక నారు మడి ఎండిపోయింది. ఇప్పుడు 20 రోజుల క్రితం 5 బస్తాల నారు పోసి 4 ఎకరాల్లో నాటు వేస్తున్న. ఇగ పంటకు నీరు పారుతదా? లేదా? అనే సందిగ్ధంలో ఉన్న. ఎందుకంటే పక్కనే గోదావరి కాల్వలున్నయి.. దానికి తోడు బోరుబావి ఉందని నారు పోసినప్పటికీ కాలం కాకపోవడం, గోదావరి జలాలు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నం. ప్రభుత్వం, అధికారులు రైతుల బాధలు పట్టించుకొని నీరు విడుదల చేస్తే పంటలేసుకుంటం.
– కొర్ర శంకర్ నాయక్, రైతు కొర్రతండా, జనగామ మండలం
అన్ని రిజర్వాయర్లను వెంటనే నింపాలి..
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లను వెంటనే నింపి పంటలు కాపాడాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులను కోరారు. కాలుకు శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్ మొయినాబాద్ ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన దేవాదుల నీటి కోసం శామీర్‌పేటలో రైతులు ధర్నా చేసిన విషయం తెలుసుకొని సంబంధిత అధికారులకు ఫోన్ చేశారు. రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని, వారిని సమీకరించి పెద్దఎత్తున ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. అదనులో వర్షాలు కురవకపోవడం, దేవాదుల రిజర్వాయర్ల నుంచి నీటి విడుదల జరగపోవడంతో నారు మడులు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
జనగామ నియోజకవర్గంలోని రిజర్వాయర్ల నుంచి నీటిని పంపింగ్ చేసేందుకు రెండు పెద్ద, రెండు చిన్న పంపులుండగా, అందులో పెద్ద పంపు ఒక్కటే ఆన్ చేశారని, రెండోది కూడా నడిపించాలని కోరారు. 30 క్యుమెక్స్ నీటిలో 10 క్యుమెక్స్ ఆర్ఎస్ ఘన్‌పూర్‌కు, 2 క్యుమెక్స్ మిషన్ భగీరథకు పోయినా 18 క్యుమెక్స్ నిల్వ సామర్థ్యం నుంచి నీటిని విడుదల చేయాలన్నారు. బొమ్మకూరు నుంచి లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్‌కు నీటిని వదలిపెట్టలేదని, ఇప్పుడు నడుస్తున్న 7 క్యుమెక్స్ మోటర్‌కు తోడు అంతే సామర్థ్యం కలిగిన మరో పంపును ఆన్ చేస్తే తపాస్పల్లితోపాటు జనగామ ప్రాంతానికి ఇబ్బంది ఉండదన్నారు.
వెల్దండ పంపు ఆన్ చేస్తే తపాస్‌పల్లికి నీటి సరఫరా నిలిచిపోయి చేర్యాల ప్రాంతంలో పెద్ద గొడవ జరుగుతుందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా జనగామ నియోజకవర్గంలోని ఆయకట్టుకు సాగునీరివ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజూ రైతులు తనకు సమస్యలు చెబుతుంటే ఇరిగేషన్ కార్యదర్శి సహా ఈఎన్సీ, సీఈ, ఎస్ఈ, డీఈ, ఏఈల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ రైతుల కోరిక మేరకు వెంటనే అన్ని మోటర్లు ఆన్ చేసి రిజర్వాయర్లు, చెరువులను నింపి పంటలను కాపాడాలని అధికారులు, ప్రభుత్వాన్ని కోరారు. సాగునీటి అంశంలో నిర్లక్ష్యం వహించినా, రిజర్వాయర్లు, చెరువులు నింపకున్నా రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన చేపడతామని ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు.