జనగామ రూరల్, ఫిబ్రవరి27: కాల్వలకు నీటిని విడుదల చేయాలని అధికారుల చుట్టూ తిరిగితిరిగి వేసారిన రైతులు గురువారం జనగామ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తలాపునే రిజర్వాయర్, ప్రతి గ్రామానికి కాల్వలు ఉన్నా నీటిని ఎందుకు విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ మండలంలోని గానుగుపహాడ్, ఎర్రకుంట తండా, పెద్దపహాడ్, గోపరాజుపల్లి, వడ్లకొండ, బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఇరిగేషన్ కార్యాలయానికి రాగా, సంబంధిత అధికారి అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని పల్లా రాజేశ్వర్ రెడ్డికి తమ గోడును వివరించారు.
అనంతరం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ రిజర్వాయర్‌కు గోదావరి జలాలు విడుదల చేసి తమ పంటలను కాపాడాలని రైతులు అధికారుల చుట్టూ తిరిగినా నీటిని విడుదల చేయడం లేదన్నారు. దేవాదుల నుంచి నీటిని పంపింగ్ చేసి బొమ్మకూర్ రిజర్వాయర్‌లో నీటిని నింపాలనే ఆలోచన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు లేదని, మరి ఏం పీకుతున్నారని మండిపడ్డారు. గతంలో ఒక గుంట ఎండిపోని భూమి నేడు నీళ్లులేక ఎండిపోయిన వందల ఎకరాల పొలాలు దర్శనమిస్తున్నాయని తెలిపారు.
రైతుల సమక్షంలోనే ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారి మంగీలాల్‌తో ఫోన్లో మాట్లాడారు. వెంటనే జలాలు విడుదల చేయలని, లేకుంటే వేసిన పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు అత్మహత్యలు చేసుకొనే పరిస్థితి వస్తుందన్నారు. రెండు, మూడు రోజుల్లో నీటిని విడుదల చేయడానికి కృషి చేస్తానని ఇరిగేషన్ అధికారి తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు మేకల కళింగరాజు, గోవర్ధన్, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గద్దల నర్సింగరావు, మండల పార్టీ అధ్యక్షుడు బైరగోని యాదగిరి గౌడ్, సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షురాలు బొల్లం శారద, మాజీ సర్పంచ్ శానబోయిన శ్రీనివాస్, రైతులు కొర్ర శంకర్ నాయక్, అయిలయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.