జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రుణమాఫీ కాని రైతులు బ్యాంకుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తూనే ఉన్నారు. జిల్లాలో మొదటి విడుత 14,079 మంది రైతులకు రూ. 82.25 కోట్లు, రెండో విడుత 8851 మంది రైతులకు రూ.103.68 కోట్లు, మూడో విడుత 6753 మంది రైతులకు రూ.113.40 కోట్ల రుణం మాఫీ అయింది.
కాగా భూపాలపల్లి మండలం దూదేకులపల్లి గ్రామంలో 152 మంది కాకతీయ గ్రామీణ వికాస్ బ్యాంకులో రుణం తీసుకోగా కేవలం ఐదుగురికి మాత్రమే రుణమాఫీ అయింది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పుకొనే ఈ ఊరిలో రైతులకు రుణమాఫీ జరుగకపోవడం చర్చనీయాంశమైంది. రైతులు బ్యాంకు అధికారులను సంప్రదించినప్పటికీ సరైన సమాధానం చెప్పకపోవడంతో వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. సర్కారుపై మండిపడుతూ రుణమాఫీ చేయకపోతే ఊరుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు.
నర్సంపేట : నాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఐవోబీలో 2023లో రూ.70 వేల రుణం తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో నా పేరు లేదు. ఐవోబీ పరిధిలో ఉన్న రైతుల్లో ఒక వంతు మందికి కూడా రుణమాఫీ కాలేదు. అటు వ్యవసాయ అధికారులు, ఇటు బ్యాంకు అధికారులు ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో అయోమయానికి గురవుతున్నాం. ప్రభుత్వం రుణమాఫీ చేశామని ప్రచారం చేస్తున్నా, ఆచరణలో అమలు కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం అర్హత ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయాలి.
– కోరుకొండ శ్రీనివాస్, రైతు, అలంకానిపేట, నర్సంపేట
మా ఊరిలో 152 మంది పంట రుణా లు తీసుకుంటే ఐదుగురికి మాత్రమే మాఫీ జరిగింది. నేను రూ.90వేలు, నా భార్య పేరున రూ.90 వేలు రుణం తీసుకున్నం. అవి వడ్డీతో రూ. 2లక్షల వరకు పెరిగింది. ఇద్దరిలో ఎవరికీ రుణమాఫీ కాలేదు.
– బిలుగు సమ్మయ్య, రైతు, దూదేకులపల్లి, భూపాలపల్లి
నేను భూపాలపల్లి లో ఆజంనగర్ బ్రాం చి ఏపీజీవీబీలో రూ. 70 వేలు రుణం తీసుకున్న. వడ్డీతో కలిపి 1.60 లక్షలు అయ్యా యి. ఇదివరకే వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకున్నా. అయినా మాఫీ కాలేదు. రోజూ బ్యాంక్ చుట్టూ, అధికారులు చుట్టూ తిరుగుతున్నం.
– బానోత్ గోపి, దూదేకులపల్లి, భూపాలపల్లి జిల్లా
దేవరుప్పుల : మాది రామరాజుపల్లి. సింగరాజుపల్లిలోని ఏపీజీవీబీలో నాకు రూ. 96 వేల అప్పు ఉంది. ఇక్కడే రెన్యువల్ చేస్తా. ఇప్పటికీ మాఫీ కాలే. వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారుల చుట్టూ తిరగని రోజులేదు. ఎవ్వలు సరిగ చెప్తలేరు. ఇగ లాభం లేదని బ్యాంకు మేనేజర్‌ను నిలదీస్తే నీ పేరు దుబ్బాక గ్రామంలోని ఏపీజీవీబీలో పడింది. అక్కడ బ్యాంకులో మాఫీ వచ్చిందన్నడు. నేను అప్పు తీసుకున్నది సింగరాజు పల్లి బ్యాంకులైతే దుబ్బాకతో నాకేం సంబంధం. ఇదేందని మేనేజర్‌ను అడిగితే వ్యవసాయ శాఖ వద్దకు పోతే బ్యాంకు వాళ్లే సరిచేస్తారని చెబుతున్నరు.
– కాల్వ మధు, రైతు, రామరాజుపల్లి, దేవరుప్పుల మండలం
మహదేవపూర్ : నాకు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. నేను వ్యవసాయం కోసం మహదేవపూర్‌లోని డీసీసీ బ్యాంక్‌ల పంట రుణం తీసుకున్న. రూ.2 లక్షల పంట రుణమాఫీ లిస్ట్‌లో నా పేరు రాలేదంటాండ్రు. వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పి దాటవేస్తున్నరు. రైతులకు కనీస సమాచారం ఇచ్చే వారు లేక ఆఫీస్‌ల చుట్టూ తిరుగుడైతాంది. షరతులు లేకుండానే ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి రైతుకు పంట రుణం మాఫీ చేయాలి.
– అడప లక్ష్మీనారాయణ, రైతు, మహదేవపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా