కాశీబుగ్గ, డిసెంబర్13: అబద్ధాలతో రేవంత్‌రెడ్డి మోసం చేశాడని, రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు తప్పుదోవ పట్టించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ నగరంలోని పైడి పల్లిలో గల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రి కల్చర్ యూనివర్సిటీ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హాజరయ్యారు. సభలో రుణమాఫీపై రైతులు ఆయనను నిలదీశారు. రుణమాఫీ వంద శాతం అయినట్లు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు అబద్ధాలు చెప్పా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ కాకుంటే రైతులంతా ఏకమై ప్రభుత్వా నికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వెంటనే స్పందించిన కోదండరెడ్డి తొందర పడొద్దని, టెక్నికల్ ప్రాబ్లమ్‌తో రుణమాఫీ నిలిచిపోయిందన్నారు. తొందర్లోనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో రూ. రెండు లక్షల రుణం మాఫీ చేస్తామని ఆశపెట్టి మోసం చేశారు. ఇప్పటి వరకు 60 శాతం రైతులకు మాత్రమే రుణమాఫీ చేసిన్రు. పాలమూరులో జరిగిన రైతు సభలో వంద శాతం రుణమాఫీ చేసినట్లు సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధం చెప్పిండు. అలాగే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా చెప్పి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నరు. రూ. 2లక్షలపైన ఉన్న లోన్ వ్యవసాయానిది కాదని, కమర్షియల్ అని దాటవేస్తున్నరు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలి. రైతు భరోసా రెండు పంటలకు రూ. 15 వేలు అని ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చినట్లు రైతు లకు 10 ఎకరాల లోపు ఇవ్వాలి.
– కొండారెడ్డి, కొమ్మాల, గీసుగొండ, వరంగల్
నాతో పాటు చాలా మంది రైతులకు ఎలాంటి రుణ మాఫీ జరుగలేదు. వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్యలు పరిష్కరించాలి. సీఎం రేవంత్‌రెడ్డి 2018 డిసెంబర్ 9 నుంచి 12 డిసెంబర్ 2023 లోపు రుణ మాఫీ చేస్తామని చెప్పి రూ. రెండు లక్షల వరకే మాఫీ చేసిండు. రూ. 2లక్షల పైన ఒక్క రూపాయి ఎక్కువ అప్పు ఉన్నా రుణమాఫీ చేయడం లేదు. నాకు రెండు లక్షల పైగా అప్పు ఉండగా రుణమాఫీ కాలేదు. రైతులను ప్రభుత్వం కావాలనే మోసం చేసింది.
– మంతపూరి యాదగిరి, కన్నయ్యపల్లి, రఘునాథపల్లి, జనగామ