కాంగ్రెస్ ప్రభుత్వంపై కర్షకులు కన్నెర్ర చేశారు. రేవంత్ సర్కార్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసించారు. సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని 179 గ్రామాలకు చెందిన 20 వేలకు పైగా రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకొని ర్యాలీగా ఆయా గ్రామాల ప్రధాన కూడళ్లకు చేరుకొని ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతు భరోసా పథకంలో ఎకరానికి రూ. 15 వేలు అందించాలని డిమాండ్ చేశారు. సన్న వడ్లు విక్రయించి రెండు నెలలైనా బోనస్ ఇవ్వలేదని, క్వింటాకు రూ. 500 చొప్పున వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
– నమస్తే నెట్వర్క్, ఫిబ్రవరి 10