పరకాల, జూలై 14 : అదును దాటుతున్నా ఎవుసం ముందుకు సాగడం లేదు. ఏటా ఈ సమయానికి సంబురంగా సాగే వ్యవసాయ పనులు ఈసారి మాత్రం వరుణుడి జాడ లేక, జల వనరులకు సాగునీరందక సీజన్ మొదట్లోనే రైతులను ఆగం చేస్తున్నది. జోరువాన కురవాల్సిన జూలై రెండో వారంలోనూ ఎండలు దంచికొడుతుండడంతో బోర్లు, బావులు అడుగంటి పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి తోడు యూరియా కొరత తీవ్రంగా వేధిస్తున్నది.
బావులు, బోర్లు ఉన్న రైతులు నాటు వేసేందుకు దుక్కులు సిద్ధం చేసుకోగా నాటు వేసేందుకు అవసరమైన ఎరువులు దొరకక సొసైటీల వద్ద క్యూలైన్లలో బారులు తీరడమే గాక, చెప్పులు, ఆధార్‌కార్డులు వరుసలో పెట్టి ఓ రకంగా యుద్ధం చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సరిపడా నిల్వలు లేకపోవడం.. అంతటా కొరత ఉండడంతో రైతుల అవసరాన్ని ఆసరా చేసుకొని ప్రైవేట్ వ్యాపారులు యూరియాను బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయించడమే గాక అవసరం లేని మందులు, గుళికలు, నానో యూరియాను అంటగడుతూ నిండా ముంచుతున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్య ధోరణితో సీజన్ ప్రారంభంలోనే అందుబాటులో లేవు. వ్యవసాయ శాఖ అధికారుల ప్రతిపాదనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాలకు ఎరువులను కేటాయిస్తుంది. వాటిని అవసరం మేరకు ప్రైవేట్ వ్యాపారులకు, సొసైటీలకు సరఫరా చేసి తద్వారా రైతులకు అందిస్తారు.
కానీ ఈ ఏడాది ఉమ్మడి జిల్లాకు అవసరమైన యూరియా నిల్వలను సరఫరా చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జిల్లాకు కేటాయించిన యూరియాలో 3వ వంతు మాత్రమే సరఫరా చేశారు. ఉమ్మడి జిల్లాకు జూలైలో సుమారు 44 వేల టన్నుల యూరియా అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే 30వేల టన్నులు మాత్రమే సరఫరా అయినట్లు జిల్లా వ్యవసాయ అధికారులు చెప్పారు. దీంతో ఈ సీజన్లో పంటలకు అవసరమైన మేర యూరియా దొరకక చాలామంది రైతులు బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయిస్తున్నారు.
నర్సింహులపేట : వేసవిని మించి ఎండలు దంచికొడుతుండడంతో తడిసిన పంటలు మరుసటి రోజుకే ఎండిపోతున్నాయి. పదేళ్ల క్రితం ఏ ఊరిలో చూసినా జలకళతో చెరువు, చెక్‌డ్యాములు మత్తడి దూకుతూ పంట పొలాల వైపు పరుగులు తీసేవి. ప్రస్తుతం వర్షాలు లేక.. సాగునీరు అందక, ఉన్నకొద్ది నీటిని పంటలు కాపాడుకునేందుకు నీటి తడులు ఇస్తే ఎండకు మరుసటి రోజే ఆవిరవుతున్నాయి. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బోర్లు, బావులు ఎండిపోవడంతో సాగునీటి సమస్య మరింత తీవ్రమైంది. పెసర, మక్కజొన్న, పత్తి పంటలను కాపాడుకునేందుకు రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
మూడేళ్ల క్రితం మా ఊళ్లో ఉన్న చెరువులు, కుంటల్లో నీళ్లు నిండుగా ఉండేవి. ఊరు చెరువు ఎండాకాలంలో మత్తడి పోసేది. ఊరచెరువు, కుమ్మగొని కుంటలో నీళ్లు గుంతలో ఉన్నాయి. కాలం కాక నీళ్లు లేక బోరు మోటర్ ఆగి ఆగినీళ్లు పోస్తున్నది.రెండు ఎకరాల్లో వేసిన పెసర ఎండుతుంది. ఎకరంపావు పొలం కౌలుకు తీసుకున్న. వాన ఉంటే ఒక రోజునే పొలం దున్నుడు అయ్యేది. వారం రోజుల సంది పొలం దున్నకం చేస్తున్నా. ఒక వాన పడితే పెసర పంట పండేది.
– తిప్పరబోయిన వెంకన్న, పడమటిగూడెం
యూరియా కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఏ షాపులో అడిగినా యూరియా లేదంటున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోని సొసైటీల్లో కూడా యూరియా దొరకడం లేదు. గిట్లయితే వ్యవసాయం చేసేది కష్టమవుతుంది. ఇప్పుడు ఒక్క వర్షం వచ్చిందంటే పత్తి పండించే వాళ్లు పత్తి మొక్కలకు ఎరువులు వేయాల్సి ఉంటది, వరి దుక్కులు పొతం చేసి నాట్లు వేస్తరు. అసలు వర్షాలు లేనప్పుడే యూరియాకు గిట్ల ఇబ్బందులు ఉంటే వర్షాలు పడితే ఇంకా ఎలా ఉంటది. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం రైతులకు యూరియా అందుబాటులో ఉండేటట్లు కృషి చేయాలి.
– పల్లెబోయిన రవీందర్, రైతు లక్ష్మీపురం, పరకాల మండలం