చెరువులు, కుంటలు, బోర్లు, బావుల్లో చుక్క నీరు లేక.. రైతన్న దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎండిన పంటలను పశువులకు మేతగా వేస్తున్నాడు. కళ్ల ముందే చేతి కందే పంటలు ఎండిపోతుంటే రూ. లక్షల అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టామని అన్నదాత కన్నీళ్లు పెట్టుకుం టున్నాడు. అక్కడక్కడా ఉన్న కొద్దిపాటి నీటితో తండ్లాడుతున్నాడు. జేసీబీలతో వాగుల్లో బావులు తీస్తూ వచ్చిన అరకొర నీటితో పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎస్సారెస్పీ కాల్వలకు నీళ్లు విడుదల చేయకపోవడంతో గడ్డి, చెట్లు పెరిగి ఆనవాళ్లు కోల్పోతున్నాయి. చి‘వరి’ ప్రయత్నంగా నీటి పారుదల శాఖ అధికారులు పర్యవేక్షించి కాల్వలకు జలాలు విడుదల చేయా లని రైతులు కోరుతున్నారు. – నమస్తే నెట్వర్క్, మార్చి 15
కమలాపూర్, మార్చి 15: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని చివరి ఆయకట్టుకు ఎస్సారెస్పీ కాల్వ నీళ్లు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. హసన్పర్తి మండలం నుంచి కమలాపూర్ మండలంలోని అంబాల, శ్రీరాములపల్లి, గూనిపర్తి, మాధన్నపేట, శనిగరం, గోపాల్పూర్ గ్రామాలకు సాగునీరందించేందుకు ఎస్సారెస్పీ కాల్వ నిర్మించారు. అందులో నీళ్లు రాకపోవడంతో మక్కజొన్న, వరి పంటలు ఎండుతుర్నాయి. కాల్వ నీళ్లు వదలకపోవడంతో అందులో గడ్డి, చెట్లు పెరిగి ఆనవాళ్లు కోల్పోతున్నాయి. నీటి పారుదల శాఖ అధికారులు పర్యవేక్షింకచి నీటిని చివరికి అందేలా చూడాలని కోరుతున్నారు.
భీమదేవరపల్లి, మార్చి 15: ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతన్నకు కన్నీరే మిగులుతున్నది. వ్యవసాయ బావిలో నీరు అడుగంటిపోవడంతో పుట్టెడు అప్పులు తెచ్చి వేసిన మక్కజొన్న పంట పశువులకు మేతగా మారింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామపంచాయతీ పరిధిలోని హవల్దార్పల్లిలో కత్తుల కుమారస్వామి తనకున్న రెండెకరాల్లో మక్కజొన్న పంట వేశాడు. పదికోలల వరకు లోతు ఉన్న వ్యవసాయ బావిలో చుక్క నీరు లేదు. పంటకు సాగునీరు లేకపోవడంతో తన ఆవు, లేగ దూడకు మక్కజొన్న పంట పశుగ్రాసంగా మారింది. ఇతని పక్కనే సింగరవేన సారయ్య వ్యవసాయ భూమి ఉంది. ఇతని బావిలో కూడా నీరు లేదు. తెచ్చిన పెట్టుబడికి ఎట్ల అప్పు చెల్లించాలో అర్థంకాక తన మక్కజొన్న పంటలోనే దిగాలుగా కూర్చున్నాడు. గత పదేళ్లుగా పంటలు బాగా పండినై..నీటికి కొదువ లేక ఎవుసం బాగా నడిచింది. ఇప్పుడేమో కరువు మల్ల కాటేస్తాంది.. అంటూ ఆవేదన చెందాడు.
దంతాలపల్లి, మార్చి 15 : మండల పరిధిలోని పాలేరు వాగు కింద గత బీఆర్ఎస్ హయాంలో మాదిరిగానే సాగు నీరు సమృద్ధిగా ఉంటుందనుకొని రైతులు యాసంగి వరి, మక్కజొన్న, మిరప పంటలను సాగు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు పూర్తిస్థా యిలో సాగు నీరందడం లేదు. ఎస్సారెస్పీ ద్వారా నీటిని వదలకపోవడంతో మండలంలోని వేములపల్లి సమీపంలోని పాలేరు వాగు ఎండిపోవడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. జేసీబీల సహాయంతో వాగులో బావి తవ్వి వచ్చిన కొద్దిపాటి ఊటతో చేనుకు పారించుకుంటున్నారు.
తొర్రూరు: తొర్రూరు మండలంలో కాకతీయ మెయిన్ కెనాల్ ద్వారా సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైలారం రిజర్వాయర్ ఫేస్-2 నుంచి కాకతీయ మెయిన్ కెనాల్ డీబీఎం 59, డీబీఎం 57, డీబీఎం 60 కాల్వలు, సబ్ మైనర్ కాల్వల ద్వారా నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. మండలంలో గతేడాదితో పోలిస్తే నీటిమట్టం గణనీయంగా తగ్గింది. 2024 మార్చిలో 13.71 మీటర్ల నీటిమట్టం ఉండ గా, 2025 మార్చిలో 7.85 మీటర్లకు పడిపోయింది. మొత్తంగా 5.86 మీటర్ల మేర తగ్గింది. మండలంలో మొత్తం 16,500 ఎకరాల్లో వరి, 2,400 ఎకరాల్లో మకజొన్న సాగు చేయగా, ప్రస్తుతం 50 శాతం కంటే ఎకువ పంటలు నీరులేక ఎం డిపోతున్నాయి. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టామని, వెంటనే సాగు నీరందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
ఐనవోలు, మార్చి 15: గతంలో మాదిరిగా కాల్వలో నీళ్లు వస్తాయనుకొని రెండున్నర ఎకరాల్లో మక్కజొన్న పంట వేసిన. మా భూమి 5 ఎల్డీ-9 సౌత్ మెయిన్ కెనాల్, డీ-4 కాల్వ ఒడ్డుకు ఉంది. గతంలో జనవరి నుంచి మార్చి వరకు కాల్వలో నీళ్లు మూడు నుంచి నాలుగు సార్లు వదిలేవాళ్లు. దీంతో బావులు, బోర్లలో నీళ్లు ఉబికేవి. అదే ధైర్యంలో రెండున్నర ఎకరాల్లో మక్క జొన్న పంట వేసి, కంకి పీసు తోడే టైంకు బోరు ఎండి పోయింది. కాల్వ ఒడ్డుకే ఉన్నది. నీళ్లు వస్తే పంట పండుతుంది అనుకున్న, కానీ నీళ్లు రాకపోవడంతో చేతికొచ్చిన పంట ఎండిపోయింది. రూ.50 వేల నష్టం జరిగింది. పంట ఎండిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– పెండ్లి కుమారస్వామి, రైతు, ఒంటిమాడిపల్లి (నాగపురం)