కమలాపూర్, మార్చి 11 : మండలంలోని అంబాల గ్రామం లో పరకాల-హనుమకొండ రహదారిపై శ్రీరాములపల్లి, గూనిపర్తి, అంబాల గ్రామాల రైతులు సాగునీటి కోసం సోమవారం రోడ్డుపై బైఠాయించి వంటావార్పు చేసి నిరసన తెలిపారు. ఎస్సారెస్పీ అధికారులు డీబీఎం 24కు సరిపడా నీటిని విడుదల చేయకపోవడంతో హసన్పర్తి మండలం నాగారం వరకే వస్తుండడం తో అక్కడి రైతులు కాల్వకు అడ్డంగా కట్టలు కడుతున్నారన్నారు. దీంతో తమ గ్రామాలకు కాల్వ నీళ్లు రాక పంటలు ఎండుతున్నాయన్నారు. కాకతీయ కాల్వ నిండుగా వెళ్తున్నా అధికారులు పూర్తిస్థాయిలో గేట్లు లేపకపోవడంతో నీళ్లు కొద్దిగా వస్తున్నాయ ని, సగం దూరం వరకు కూడా రావడం లేదన్నారు. యాసంగి లో సాగు చేసిన వరి పొట్టదశకు వచ్చిందని, మక్కజొన్న పీసు వేస్తుండడంతో నీళ్లు అందక ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
డీబీఎం 24కు నీళ్లు ఎక్కువగా విడుదల చేయాలని అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంతో రోడ్డుపై బైఠాయించినట్లు తెలిపారు. కాలువ నీళ్లు రాకపోతే 500 ఎకరాల్లో పంటలు ఎండిపోతాయన్నారు. పెట్టుబడులు పెట్టి చివరికి పంటలు ఎండితే అప్పుల్లో కూరుకుపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఎస్సారెస్పీ అధికారులు వచ్చే వరకు ధర్నా విరమించేది లేదని తేల్చిచెప్పా రు. దీంతో అక్కడికి వచ్చిన ఎస్సారెస్పీ ఏఈ రాకేశ్ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పాడు. నీళ్లు వెంటనే విడుదల చేయాలని రైతులు పట్టుబట్టడంతో ఏఈ తన పరిధిలో లేదని చేతులెత్తేశాడు. సీఐ హరికృష్ణ ఎస్సారెస్పీ ఎస్ఈ వద్దకు తీసుకెళ్తానని చెప్పడంతో రైతులు ధర్నా విరమించారు.