యాసంగి వడ్లు కొనమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడంతో మొదట దిగాలు పడ్డ రైతన్న.. ఇప్పుడు ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నాడు. సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నట్లు ఆరుతడితో పాటు లాభాలు ఎక్కువగా వచ్చే కూరగాయలు పండించేందుకు ఇష్టపడుతున్నారు. మార్కెట్లో వీటికి డిమాండ్‌తో పాటు మంచి ధర ఉండడం వల్ల ఇక వరి సాగు బంద్ చేస్తున్నారు. కేవలం తిండి మందమే పెట్టి మిగతా భూముల్లో కాయగూరలే వేస్తామంటున్నారు దేవరుప్పుల మండలం సీత్యాతండా గిరిజన రైతులు. కూరగాయలతో పాటు కందగడ్డ కూడా వేసి తామే గ్రామాల్లో, అంగట్లో అమ్ముకుంటామని ధీమాగా చెబుతున్నారు.
వరి బంద్ వెట్టిన..
ప్రభుత్వం మన మంచికే వరి పెట్టొద్దని చెప్తాంది. ఆగమవుడు కంటే కేసీఆర్ సారు మాట వింటే మంచిది కదా. నాకున్న రెండెకరాల్ల రెండు కార్లు వరి నాటుపెట్టేది. ఈసారి వరి పూర్తి బందుబెట్టి కూరగాయలు, కందగడ్డ వేసిన. సేంద్రియ పద్ధతిలో సాగుచేస్త, పందిర్లతో కాత కాసే కూరగాయల కోసం కట్టెలు కట్టి తీగ అల్లిన. ఆ పందిరికి తీగ ఎక్కిస్తే కాత మంచిగస్తది.. గిట్ల ఐదు గుంటల్ల బీర పెట్టిన. అరెకరం కందగడ్డ, మిగతాది బెండ, గోరుచిక్కుడు, బీర, కాకర పెట్టిన. పశువుల నుంచి రక్షణ కోసం పాత చీరలు చుట్టూ కట్టిన. కూరగాయలు చుట్టు పక్క ఊళ్లళ్ల తిరిగి అమ్ముత. వరి గింజల కన్నా ఎక్కువ లాభం తీస్తననే నమ్మకం ఉంది.
వరి స్థానంలో కందగడ్డ, కూరగాయలు
ఇదివరకు వరి సాగుచేసే క్షేత్రాల్లో గిరిజన రైతులు కందగడ్డ, బీర, బెండ, సొర, బుడంకాయ, కాకర పాదులు, గోకరకాయ, దోసకాయలు, ఆకుకూరలు, కొత్తిమీర సాగు చేస్తున్నారు. కూరగాయ గింజలు కొని పెడితే సరిపోతుంద ని, ఇవన్నీ పెట్టుబడి లేని పంటలని వారు చెబుతున్నారు. పశువుల పెంట తెచ్చి చల్లి, అడపాదడపా నీళ్లు పెడితే కూర గాయలు చేతికొస్తాయంటున్నారు. వారం వారం అంగట్లో కూరగాయలు తామే అమ్ముకుంటామని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే హైబ్రిడ్ రకం కూరగాయల గింజలు ప్రభుత్వం ఉచితంగా ఇస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు.
తిండి మందమే పెడ్త..
నాకున్న భూమిల తిండిమం దమే వరి పెడుత, మిగిలిన జాగల కూరగాయలు సాగు చేస్త. మొత్తం ఎకురన్నరల ఇవే పండిస్త. పెట్టుబడి లేని పంట, మాకు కోతుల బాధ లేదు. ఇం ట్లోళ్లం అందరం కలిసి కలుపుతీత్తే సరిపోతది. వారానికో తడి పెట్టాలె. కాత వచ్చినంక పాలకుర్తి, దేవరుప్పులకు పోయి అంగట్ల హోల్‌సేల్‌కు అమ్ముత. ప్రతి రోజూ నా ఎక్సెల్ బండి మీద రోజుకో ఊళ్లె తిరిగి అమ్ముకుంట. కాయగూరలతోటి వరి కంటే ఎక్కువ సంపాదించవచ్చు.