నర్సింహులపేట నవంబర్ 2 : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో అధిక ధరకు యూరియాను విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 45 కిలోల యూరియా బస్తా ఎంఆర్పీ రూ. 270 ఉండగా బస్తా రూ.300లకు విక్రయిస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రవాణా చార్జీ పేరిట బస్తాపై రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.. ఇప్పుడు ఏకంగా బస్తాపై రూ.30 అదనంగా తీసుకోవడంపై రైతులు భగ్గుమంటున్నారు. మండలంలోని జయపురం రైతు వేదిక క్లస్టర్ వద్ద రైతులకు వ్యవసాయ అధికారులే రైతులకు కూపన్లు అందజేస్తూ బస్తాకు 300 రూపాయలు చెల్లించాలని చెబుతుండడంతో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇప్పటికే పంటలు సాగు మొదలుపెట్టిన కానుండి యూరియా దొరకక ఇబ్బందులు పడుతుంటే అధిక వర్షాల కారణంగా చేతికి వచ్చిన పంటలు పెద్ద ఎత్తున నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి పత్తి, మొక్కజొన్న, మిరప పంటలకు యూరియా వేసుకుందామంటే లిస్టులో పేర్లు వచ్చిన రైతులకు సైతం బస్తాకు 300 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంబంధిత అధికారులు ఎక్కువ ధర తీసుకుంటున్న ప్రైవేట్ డీలర్ల పై చర్య తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి బ్లాక్ మార్కెట్ దందాను అడ్డుకోవాల్సిన అధికారులే పైపెచ్చు యూరియా బస్తాను రూ.300లకు అమ్ముకోవచ్చంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఈ విషయంపై ఏవో వినయ్ కుమార్ మాట్లాడుతూ ప్రైవేట్ డీలర్లకు రవాణా ఖర్చు ఉన్నందున 300కు అమ్మకాలు చేస్తున్నారని తెలిపారు.