మహబూబాబాద్ రూరల్, మే 6 : ‘మార్కెట్లో రైతులు 25 రోజుల నుంచి వడ్లు పోసుకుని పడిగాపులు గాస్తున్నా కొనుగోలు చేయడం లేదు. వర్షం పడితే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను ఆగం చేస్తున్నది’ అని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. మంగళవారం మహబూబాబాద్ మండల పరిధిలోని శనిగపురం, ముడుపుగల్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.
ఈ సందర్భంగా రవీందర్ రావు మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నా కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ప్రభుత్వం కొనడం లేదన్నారు. ఆరుగాలం కష్టపడి పండించి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మడానికి వస్తే నిర్లక్ష్యం చేస్తున్నదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని, కొనుగోళ్లను వేగవంతం చేయడంలో సర్కారు విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలకు నష్టం చేసిందన్నారు.
గత పదేండ్ల పాలనలో కేసీఆర్ రైతులు పండించిన అన్ని పంటలకు మద్దతు ధరను అందించి కొనుగోలు చేశారని పేర్కొన్నారు. ప్రజలకు అమలు గాని హామీలిచ్చి, వాటిని అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ఫెయిలయ్యాడని, రైతులు కేసీఆర్ పాలనను అభినందిస్తున్నారన్నారు.
అనంతరం కొనుగోలు సెంటర్లలో రైతుల సమస్యలపై మార్కెట్ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. నిర్లక్ష్యం చేయకుండా కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సెంటర్ల నిర్వాహకులు, అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మార్నేని వెంకన్న, జేరిపోతుల వెంకన్న, మంగళంపల్లి కన్న, వెంకటాద్రి, అంబాల శివ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.