హసన్పర్తి, మే 9 : ‘అమ్మబోతే అడవి.. కొనబోతే కొరవి’ అన్నట్టుగా మారింది రైతుల పరిస్థితి. రైతును రాజు చేస్తానని గొప్పలు చెబుతున్న రేవంత్ సర్కార్ వడ్లు, మక్క లు కొనడంలో పూర్తిగా విఫలమైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకొనేందుకు కొనుగోలు కేం ద్రాలకు తెస్తే రోజుల తరబడి అక్కడే పడిగాపులు పడాల్సి వస్తున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని నాగారం, వంగపహాడ్లో మాత్రమే పీఏసీఎస్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, పంటను తీసుకొచ్చి 25 రోజులైనా కొనుగోళ్లు లేక మండుటెండలో కుప్పల వద్దే కాపలా ఉంటున్నారు. సెంటర్లలో గన్నీ సంచులు ఇవ్వక, మక్కలు తరలించేందుకు లారీలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రాలను అధికారులు పర్యవేక్షించకపోవడంతో ఎవరిని అడగాలో తెలియక అయోమయంలో ఉన్నారు. తూతూ మం త్రంగా ఒకరో, ఇద్దరో మహిళలను పెట్టి నడిపిస్తున్నారని, వారిని గన్నీ సంచులు ఇవ్వాలని మహిళా రైతులు నిలదీయడంతో గన్నీ సంచులు, లారీలు రావడం లేదంటూ కాంటాలు నిలిపివేశారు. రైతులే గన్నీ సంచులు కొనుగోలు చేసి, వాహనాలు సమకూర్చుకొని హుజూరాబాద్ సమీపంలోని చింతలపల్లి కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలని అంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అకాల వర్షం కురిసి పంట నీళ్లపాలవుతుందేమోనని భయాందోళన చెం దుతున్నారు. గన్నీ సంచులు అందించి మక్కలను వెంటనే కొనుగోలు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
చేతకాని దద్దమ్మ ప్రభుత్వం
రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు. నాగారం కొనుగోలు సెంటర్కు 25 రోజుల క్రితం మక్కలు తీసుకొచ్చినా గన్నీ సంచులు ఇవ్వడం లేదు. మీరే కొనుక్కొని ట్రాక్టర్లలో వంగపహాడ్ లేదా చింతలపల్లికి తీసుకుపొమ్మంటున్నరు. ఇక్కడి నుంచి ట్రాక్టర్లో మక్కలు తీసుకుపోతే రూ.4 వేలు కిరాయి అయితది. ఎవరు భరించాలె? ఈ సెంటర్లో ఒక్క అధికారి కూడా లేడు. బయట దళారులకు అమ్ముదామంటే రూ.1700కే అడుగుతుండ్రు. అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తే చివరకు రైతుకు చావే శరణ్యం.
– పోరెడ్డి రాజిరెడ్డి, రైతు, నాగారం
కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుండె..
కొనుగోలు కేంద్రానికి మక్కలు తెస్తే పట్టించుకునేవారు లేదు. గన్నీ సంచులు ఇస్తలేరు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్లలోనే అమ్మాలని చెబుతుంటే ఇక్కడ మాత్రం పట్టించుకుంటలేరు. వర్షం వస్తే మక్కలు తడిసి నష్టపోతామని భయపడి కొందరు రైతులు దళారులకు రూ.1700కు అమ్ముకున్నరు. ఈ సర్కార్ రైతులను ఇబ్బంది పెడతాంది. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండె.. గత ప్రభుత్వం వెంటనే మక్కలు, ధాన్యం కొని ఖాతాల్లో డబ్బులు వేసేది.
– ఎర్రగొల్ల రమేశ్, రైతు, అంబాల