యూరియా కోసం అన్నదాతల గోస దేవుడికి ముడుతున్నది. ప్రభుత్వం ముందుచూపు లేని కారణంగా వ్యవసాయ పనుల్లో ఉండాల్సిన రైతులు ఎరువు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా కుటుంబాలతో సహా సొసైటీల వద్దే గడుపుతున్నారు. సాగు చేయడం కంటే యూరియా సాధించడ మే కష్టంగా మారిందని సర్కారు తీరుపై మండిపడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి మహబూబాబాద్‌లోని సొసైటీ ఎదుట పడిగాపులు గాచిన రైతులకు ఎవరూ సమాధానం చెప్పేవారు లేక ఆగ్ర హంతో ఎమ్మెల్యే మురళీనాయక్ క్యాంపు ఆఫీస్ ముట్టడికి యత్నించారు.
– మహబూబాబాద్ రూరల్/ నర్సింహులపేట/ స్టేషన్‌ఘన్‌పూర్/ తరిగొప్పుల, ఆగస్టు 29
ఐదు రోజుల క్రితం టోకెన్లు ఇచ్చినా యూరియా మాత్రం ఇవ్వడం లేదని శుక్రవారం మహబూబాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున సొసైటీ వద్దకు చేరుకున్నారు. సొసైటీలో ఒక్క యూరియా బస్తా కూడా లేదని అధికారులు సొసైటీకి తాళం వేసి వెళ్లిపోయారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు సొసైటీ వద్దే పడిగాపులు గాశారు. ఆగ్రహంతో మహబూబాబాద్- తొర్రూరు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే మురళీనాయక్ లోకల్లో ఉన్నాడని తెలుసుకొని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరారు. పోలీసులు గేటు వద్ద అడ్డుకోవడంతో రైతులకు వారికి తోపులాట జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. ఎమ్మెల్యేతో మాట్లాడాలని రైతులు ఎంత చెప్పినా పోలీసులు మాత్రం లోపలకు పంపించలేదు.
ఈ క్రమంలో కొంతమంది మహిళా రైతులు లోపలకు వెళ్లే ప్రయత్నం చేయగా, మహిళా కానిస్టేబుళ్లు అడ్డుకొని వారిని బయటకు పంపించారు. ఎమ్మెల్యే వెంటనే బయటకు రావాలని, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ గేటు ఎదుట నినాదాలు చేశారు. అనంతరం అక్కడకు చేరుకున్న మండల వ్యవసాయ అధికారికి రైతులు తమ సమస్యలను వివరించారు. పోలీసులు, వ్యవసాయ అధికారులు రైతులకు సర్ది చెప్పి వారి ఆధార్‌కార్డ్‌లు తీసుకొని, రేపు యూరియా లోడ్ రాగానే అందరికీ ఇస్తామని చెప్పి పంపించారు. నర్సింహులపేట మండలంలోని పీఏసీఎస్ కార్యాలయానికి మూడు రోజులుగా యూరియా బస్తాలు రాకపోవడంతో మండలంలోని వివిధ గ్రామాల రైతులు వ్యవసాయ పనులు వదులుకొని, తిండీతిప్పలు మాని అక్కడే పడిగాపులుగాస్తున్నారు.
కనీసం ఎప్పుడు వస్తుందో అధికారులు చెప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలోని రాజరాజేశ్వరి ఫర్టిలైజర్ గోదాముకు శుక్రవారం యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి లైన్లో నిలబడ్డారు. ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం తరిగొప్పుల మండల మాజీ అధ్యక్షుడు ముక్కెర బుచ్చిరాజు యాదవ్ మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన యూరియాను సకాలంలో అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందన్నారు.
నా పేరు బత్తుల వెంకటపతి. మాది సముద్రాల గ్రామం. 20 ఎకరాల వ్యవసాయం ఉంది. నాటు వేసి నెల రోజులవుతున్నా ఇప్పటి వరకు యూరియా వేయలేదు. నా భార్య, నేను నాలుగు రోజులుగా ఫర్టిలైజర్స్ షాపుల చుట్టూ తిరుగుతున్నాం. ఒక్క బస్తా కూడా దొరకలే. రైతుల కష్టాలు పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెవరి గురించి ఆలోచిస్తుంది. పండించిన ధాన్యం మొత్తం రైతులమే తింటామా.. రాష్ట్ర ప్రజలు తినరా.., వ్యవసాయం వద్దంటే ఊరుకొని అడుక్కతినమంటే అలాగే బతుకుతాం.
– బీ వెంకటపతి, రైతు, సముద్రాల, స్టేషన్‌ఘన్‌పూర్
పర్వతగిరి, ఆగస్టు 29 : యూరియా దొరకక ఆవేదన చెందిన ఓ రైతు తన కుటుంబ సభ్యులతో కలిసి పత్తి చేను పీకేసి నిరసన వ్యక్తం చేశారు. పర్వతగిరి మండలంలోని చింతనెక్కొండ శివారు ఏబీ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఉట్టి తండాకు చెందిన భూక్యా బాలునాయక్ తన ఇద్దరు కుమారులు గణేశ్, రాజుతో కలిసి పత్తి పంట సాగు చేస్తున్నారు. గత పదిహేను రోజుల నుంచి యూరియా బస్తాల కోసం క్యూలో ఉంటున్నా దొరకకపోవవడంతో పంటలను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక కడుపు మండి పత్తి పంటను పీకేసినట్లు రైతు బాలు నాయక్ కన్నీటి పర్యంతమయ్యాడు. కాంగ్రెస్ పాలనతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉన్నారని, నేడు సీఎం రేవంత్‌రెడ్డి రైతుల కంట కన్నీటికి కారణమయ్యాడని ఆరోపించారు. దీంతో బాలునాయక్‌కు బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వీర న్ననాయక్, నాయకులు గటిక మహేశ్, కాట్రోజు రాజు యాదవ్ తదితరులు ధైర్యం చెప్పి ఓదార్చారు. ప్రభుత్వం తక్షణమే యూరియా అందించాలని డిమాండ్ చేశారు.
ఐదు ఎకరాల్లో నాటు వేసిన. ఇప్పటి వరకు బస్తా యూరియా కూడా దొరకలేదు. నేను నా భార్య ఇద్దరం ఐదురోజుల సంది ఇక్కడే ఉంటున్నాం. అసలు బస్తాలు వస్తా యే రావో అధికారులు చెప్పుతలేరు. పొలానికి యూరియా వేయక ఎర్రబారి పోతాంది. గోసపడుతున్నాం.. అన్నం లేక పస్తులుంటున్నాం.
– గుగులోత్ హర్య, ఫకీరతండా, నర్సింహులపేట
మేము ఓట్లు వేస్తే గెలిచిన ఎమ్మెల్యే మాకు సమస్య వచ్చిందంటే కనీసం బయటకు వచ్చి వినడం లేదు. మేము ఇక్కడ ఇబ్బంది పడుతుంటే ఏసీ రూమ్‌లో కూర్చున్నడు. ఒక్క యూరియా బస్తా కోసం కుటుంబం మొత్తం లైన్లో ఉన్నా దొరకడం లేదు. వారం రోజుల కిందట పేర్లు రాసుకొని టోకెన్లు ఇచ్చిండ్రు. ఇంత వరకు యూరియా బస్తాలు ఇవ్వలే. పొలం పని వదులుకొని సొసైటీ చుట్టూ తిరుగుతున్నాం. యూరియా కోసం ఎవరిని అడగాలి.
-కారే భద్రయ్య, రైతు, రెడ్యాల