ఈ చిత్రంలో కనిపిస్తున్నది జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ధర్మసాగర్ రిజర్వాయర్ ఉత్తర డి-6 డిస్ట్రిబ్యూటరీ కాలువ. ఈ కాలువ అంతా పూడిక నిండిపోయింది. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. ఇక చేసేదేమీ లేక రైతులే తలా కొంత పోగేసుకుని లక్ష రూపాయల వరకు జమ చేసి బుధవారం ఇలా మరమ్మతు చేసుకోవాల్సి వచ్చింది.
– హనుమకొండ సబర్బన్, ఆగస్టు 6
ఇది కేవలం ఒక డీ-6 రైతులదే కాదు ధర్మసాగర్ రిజర్వాయర్ పరిధిలోని అందరి పరిస్థితి ఇలాగే ఉంది. నీటి విడుదల చేయడమే మా వంతు పంట పొలాలకు పారించుకోవడం మీ వంతు అన్నట్లుగా అధికారుల తీరు ఉంది. వారి నిర్లక్ష్యం, పట్టింపులేని తనం వల్ల అనేక సమస్యలు తలెత్తడమే గాక రైతుల మధ్య గొడవలకు కారణమవుతున్నాయి. మంగళవారం రాత్రి భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల శివారులో కరీంనగర్ జిల్లా పరిధిలోకి వచ్చే కాట్రపల్లి, దమ్మక్కపేట గ్రామాల మధ్య నీళ్లు మా కంటే మాకని గొడవకు దిగారు. ఆ పంచాయితీ పోలీస్‌స్టేషన్ దాకా వెళ్లింది. ఇలాంటి కొట్లాటలు ఎన్నోసార్లు జరుగుతూనే ఉన్నాయి. పిల్ల కాల్వలు మొత్తం మూసుకుపోయాయి. తూముల షటర్లు మొత్తం ధ్వంసమయ్యాయి. ఉత్తర కాల్వ ముందున్న గ్రామాల రైతులకు మాత్రమే నీళ్లు అందుతుండగా, మిగతా వారు ఎదురుచూడాల్సి వస్తోంది.
అధికారుల పర్యవేక్షణ కరువు..
ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి ఉత్తర కాల్వను 15వేల ఎకరాలకు నీరందించేలా డిజైన్ చేశారు. ధర్మసాగర్, హసన్‌పర్తి, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ మండల పరిధిలోని గ్రామాలకు సాగునీరందించేలా 24 కిలోమీటర్ల ప్రధాన కాల్వను తవ్వారు. దీనికి 13 డిస్ట్రిబ్యూటర్లను నిర్మించారు. 119 కిలోమీటర్ల మేర పంట కాల్వలు నిర్మించారు. ఈ డిస్ట్రిబ్యూటర్లలో సగం వాటికి షటర్లు సరిగా లేవు. ఇక పంట కాల్వల పరిస్థితి అయితే చెప్పేలా లేదు.
తమకు నీళ్లు ఎక్కువగా రావాలన్న ఆత్రుతతో తూములకు అడ్డుగా పెద్ద బండ రాళ్లు, చెట్ల మొద్దులు వేయడం ఇబ్బందిగా మారింది. మరికొన్ని చోట్ల ఎన్నేళ్లయినా నీళ్లు రాకపోవడంతో విసిగిపోయి కాల్వలను పూడ్చివేశారు. దీనికంతటికి అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కారణమని రైతులు చెబుతున్నారు. నీటి పారుదల శాఖ అధికారులు తరచూ కాల్వల వెంట తిరిగితే వాస్తవ పరిస్థితులు అవగతమవుతాయని అంటున్నారు. ప్రభుత్వం కూడా పెద్దగా నీటి సరఫరా వ్యవహారాల్లో ఆసక్తి చూపకపోవడంతో అధికారులు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
దేవాదుల పైపులైన్ లీకేజీ
ఎగిసిపడిన నీళ్లు.. వృథాగా గోదావరి జలాలు
శాయంపేట, ఆగస్టు 6 : దేవాదుల ఎత్తిపోతల పథకం పైపులైన్ లీకేజీ ఏర్పడి గోదావరి జలాలు వృథాగా పోయిన ఘట న బుధవారం హనుమకొండ జిల్లా శా యంపేట మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టు నుంచి ధర్మసాగర్‌కు మోటర్లతో గోదావరి జలాలు పంపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్దకోడెపాక శివారులో దేవాదుల పైపులైన్‌కు లీకేజీ ఏర్పడి ఒక్కసారిగా భారీగా నీళ్లు పైకి ఎగజిమ్మాయి. ఈక్రమంలో పైన 11కేవీ విద్యుత్ తీగలు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మరోచోట గోవిందాపూర్ శివారులో పైపులైన్ లీకేజీ ఏర్పడిందని రైతులు తెలిపారు. భారీగా గోదావరి జలాలు వృథాగా పోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. లీకేజీపై దేవాదుల అధికారులకు సమాచారం ఇవ్వడంతో మోటర్లను బంద్ చేశారు.
తాగునీరియ్యండి సారు..
రేగులగూడెంలో ఖాళీ బిందెలతో మహిళల నిరసన
తాగునీటి కోసం మండలంలోని రేగులగూడెం గ్రామం పంచాయతీ ఎదుట బుధవారం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. 15 రోజులుగా నీటి కోసం తిప్పల పడుతున్నామని, సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తామని, బోర్ మరమత్తులు చేసి సమస్య పరిష్కరిస్తామని జీపీ కార్యదర్శి కృష్ణవేణి చెప్పారు. లేకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కొత్త బోర్ వేయిస్తామని చెప్పడంతో మహిళలు శాంతించారు. నిరసనలో సమ్మక్క, లక్ష్మి, విమల, రాజేశ్వరి, జమున, నాగమ్మ, అనూష, సత్యమ్మ, లక్ష్మి, స్వప్న, రవి, రాజయ్య, మల్లయ్య, వాసు, సంతోష్, వెంకన్న, శ్రీనివాస్, రమేశ్ పాల్గొన్నారు.
– కాటారం, ఆగస్టు 6