రఘునాథపల్లి, జూన్ 24 : రైతులను అష్టకష్టాలు పెడుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే పీఏసీఎస్‌ల ఎన్నికలు నిర్వహించాలని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని రైతులకు అన్నీ కష్టాలేనని విమర్శించారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఓటర్లకు అర చేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేశారన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి పూటకో మాట మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం లేదన్నారు.
రైతుభరోసా నిధుల విడుదలలో జాప్యం చేస్తున్నారని, రూ.2 లక్షలలోపు రైతు పంట రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ కాలేదన్నారు. పంటల కొనుగోలులోనూ కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం ఫలితంగా ఎన్నడూ లేని విధంగా రైతులు నానా ఇబ్బందులు పడ్డారని రాజయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మోసకారి విధానాలతో ఆగ్రహంతో ఉన్న రైతులు సీఎం రేవంత్‌రెడ్డికి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దీంతో సొసైటీలకు ఎన్నికలు నిర్వహించాలంటే సీఎం రేవంత్‌రెడ్డి జంకుతున్నారని ఆయన విమర్శించారు.
పరోక్షపద్ధతిలో సహకార సంఘాలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు సర్కారు యత్నించడం సిగ్గుచేటన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ నేతలు మోసకారి మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని పలు చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు తప్పుడు కేసులు బనాయిస్తూ పోలీసులతో వేధింపులకు గురిచేస్తున్నారని రాజయ్య అన్నారు. ‘ఖబడ్దార్ కాంగ్రెస్ నేతలారా.. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికొస్తే ఊరుకోం..’ అని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలోబీఆర్ఎస్ నాయకులు ముసిపట్ల విజయ్, కిరణ్, పరశురాములు, రవి, అశోక్, రాజేందర్‌నాయక్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.