కమలాపూర్, నవంబర్ 10 : కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు (బార్దాన్) లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్, ఉప్పలపల్లి, భీంపల్లి, కన్నూరు, గూడూరు, కమలాపూర్, అంబాల, పంగిడిపల్లి, గుండేడు, శంభునిపల్లి తదితర గ్రామాల్లో గన్నీ సంచుల్లేక రైతులు రోడ్డుపైనే ధాన్యం ఆరబెట్టుకుంటూ ఎదురుచూస్తున్నారు. ఓ వైపు మొంథా తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
గన్నీ సంచులు వస్తేనే కొనుగోళ్లు జరగనుండడంతో రైతులు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. నిర్వాహకులు మాత్రం రేపు, మాపంటూ కాలయాపన చేస్తున్నారు. సివిల్ సప్లయ్ అధికారులు కొనుగోళ్లను పట్టించుకోకపోవడంతో ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోయింది. పర్యవేక్షించాల్సిన అధికారులు కేంద్రాల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో ఆందోళన చెందుతున్న రైతులు వెంటనే కొనుగోలు కేంద్రాలకు గన్నీ సంచులు సరఫరా చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
నాలుగు రోజులుగా ఎదురుచూస్తున్న..
నాకున్న ఐదెకరాల్లో వేసిన వరి పంటను కోసి ధాన్యాన్ని రోడ్డుపై ఆరబెడుతున్న.. నాలుగు రోజులుగా బార్దాన్ కోసం ఐకేపీ సెంటర్ చుట్టూ తిరుగుతున్న.. పొద్దున, సాయంత్రం అంటూ నిర్వాహకులు కాలం గడుపుతున్నరు. రోజుల తరబడి ధాన్యానికి కాపలా ఉండాల్సి వస్తున్నది. బార్దాన్ ఉంటే వడ్లు ఎప్పుడో మిల్లుకు పోయేవి.
– బండారి ఐలయ్య, రైతు, ఉప్పల్