ములుగు, ఏప్రిల్3(నమస్తేతెలంగాణ)/హనుమకొండ సబర్బన్, ఏప్రిల్ 3: ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణ మార్పులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొద్ది రోజులుగా భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండుతుండడంపై రైతులు అందోళన చెందుతున్న తరుణంలో ఇప్పుడు అకాల వర్షాలు మ రింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గురువారం సాయంత్రం పలు చోట్ల స్వల్పంగా వర్షం కురిసింది.
ప్రస్తుతం ఎలాంటి నష్టం జరగకపోయినప్పటికీ వర్షాలు కొనసాగితే మా త్రం రైతులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఈదురుగాలులు వస్తే మామిడి తోటలతో పాటు ఇతర ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లనుంది. ఎండల తీవ్రతకు ఇబ్బంది పడుతున్న జనాలకు ప్రస్తుత వాతావరణం కొంత మేరకు సంతోషాన్నిచ్చిందని చెప్పవచ్చు. ఇదేకాకుండా కొందరి పంటలు చివరి తడి అందక ఎండిపోయే పరిస్థితి ఉంది. వీటికి సాధారణ వర్షం పడితే లాభం చేకూరుతుంది.
ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం(నూగూరు), మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో ఈదురు గాలులతో గంట సేపు వర్షం కురిసింది. మిర్చి పంట చేతికి వస్తున్న సమయంలో కురిసిన వర్షంతో రైతులు ఆందోళన చెందారు. మిర్చి కల్లాలపై అప్పటికప్పుడు పరదాలు కప్పి జాగ్రత్తలు పాటించినప్పటికి కొంత నష్టం వాటిల్లింది. కొన్ని ప్రాంతాల్లో మక్కజొన్నతో పాటు వరి పంటలు నేలవాలాయి.
బలంగా వీచిన గాలులకు పలు గ్రామాల్లో ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి. అక్కడక్కడా విద్యుత్ సౌకర్యానికి అంతరాయం కలిగింది. మహబూబాబాద్, కొత్తగూడ, నర్సింహుల పేట, తదితర ప్రాంతాల్లో వాన పడింది. కొన్ని చోట్ల వడగండ్లు పడ్డాయి. బయ్యారం మండలంలోని వెంకట్రాంపురం గ్రామంలోని ఓ ఇంటి వద్ద పిడుగు పడింది. దీంతో కొబ్బరి చెట్టుపై మంటలు చెలరేగాయి.